
జాతీయ రహదారుల భూసేకరణను పూర్తి చేయండి
నంద్యాల, న్యూస్ వెలుగు; రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు మరియు JC లతో పాటు రెవెన్యూ, అటవీ, TR&B, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల వంటి ప్రాధాన్య రహదారుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత నిర్మాణ సంస్థలకు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. అనంతరం జిల్లాల వారీగా కలెక్టర్లు, జేసీలతో జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, అటవీ అనుమతులపై సీఎస్ విజయానంద్ సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి నిబంధనల ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, భూసేకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి ఆయా నిర్మాణ సంస్థలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, అటవీ, టీఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ ఆఫ్ అధికారులు సమన్వయంతో పనిచేసి సకాలంలో పలు సమస్యలను పరిష్కరించాలని విజయానంద్ సూచించారు.