చెంచుల జీవన ప్రమాణాల పెంపుకు పకడ్బందీ సర్వే నిర్వహించండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ వెలుగు; నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని చెంచు గూడెంలలో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు పకడ్బందీ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో చెంచుల జీవన ప్రమాణాల సర్వేపై సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వెంకట శివప్రసాద్, డిపిఓ జమీవుల్లా, ఆత్మకూరు డిఎల్డిఓ సూర్యనారాయణ, నంద్యాల డిఎల్డిఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో 14 మండలాల్లోని 48 చెంచుగూడెంలలో 2095 కుటుంబాల్లో దాదాపు 8,000 మంది చెంచు గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారని వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు పకడ్బందీ సర్వే నిర్వహించి సమగ్ర వివరాలు సేకరించాలని పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఆదేశించారు. గూడెంలలో పక్కా ఇల్లు, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్, రహదారి సౌకర్యం, టాయిలెట్లు తదితర కనీస అవసరాలు, ప్రత్యేకించి రేషన్‌కార్డు, ఆధార్, ఆరోగ్య, కుల ధ్రువీకరణ తదితరాలతో పాటు వారి జీవన చెంచుల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏ ఏ చర్యలు చేపట్టాలి అనే అంశాలపై సమగ్ర వివరాలు సేకరించాలన్నారు. ఇందుకోసం 32 కాలమ్ లతో కూడిన ప్రొఫార్మా అందజేస్తున్నామని సచివాలయ సిబ్బంది 5 మంది గ్రూపుగా వెళ్లి పైలెట్ సర్వే నిర్వహించాలన్నారు. గూడెం ప్రజలతో కలిసిపోయి నెమ్మదిగా వివరాలు సేకరించి పక్కా సమాచారంతో కూడిన నివేదికలు ఈనెల 5వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇటీవల తాను మూడు గూడెంలను సందర్శించానని నివసిస్తున్న గుడిసెలపై టార్పాలిన్ కప్పుకోవడం, మంచినీటి సౌకర్యం లేకపోవడం, పిల్లలు తల్లిదండ్రుల వెంట అడవుల్లోకి వెళ్లడం, పరిశుభ్రంగా లేకపోవడం గమనించానన్నారు. జిల్లాలో ఇంకా జానాల గూడెం, పెచ్చెరువు గూడెంలకు విద్యుత్ సౌకర్యం లేదన్నారు. చెంచుగూడెంలలో జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు పక్కా సమాచారాన్ని సేకరించి ఇస్తే చక్కటి డిపిఆర్ తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.