ఆదర్శ ప్రాయులు, స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి దామోదరం సంజీవయ్య

ఆదర్శ ప్రాయులు, స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి దామోదరం సంజీవయ్య

   జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆదర్శ ప్రాయులు, స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.శుక్రవారం కీ.శే.దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా నంద్యాల చెక్ పోస్ట్ కూడలి వద్ద ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, వివిధ సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు…
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించారన్నారు.. సమాజానికి స్ఫూర్తిప్రదాత అయిన దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా, పెద్దపాడు గ్రామంలో 1921వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జన్మించడం జరిగిందన్నారు. కుల,మత,వర్గాలకు అతీతంగా దామోదరం సంజీవయ్య గారు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయులు, మార్గదర్శి అని కలెక్టర్ పేర్కొన్నారు… దామోదరం సంజీవయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు.. పుట్టిన 3 రోజులకే తండ్రిని కోల్పోయి మేనమామ దగ్గర ఉండి చదువుకున్నారని, అప్పట్లో ఎలాంటి వసతులు లేనప్పటికీ ఉన్నత విద్య అభ్యసించారని కలెక్టర్ పేర్కొన్నారు..1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు మంత్రిగా, 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు మంత్రిగా ఉన్నారన్నారు.. పెద్దపాడు గ్రామంలో జన్మించిన ఒక వ్యక్తి ఎంతో కష్టపడి చదివి రెండు సార్లు మంత్రి అయ్యారంటే, ప్రతి ఒక్కరు వారిని స్ఫూర్తిగా తీసుకొని, పేదవారికి సాయం చేసే స్థాయికి ఎదగాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు…కార్మిక శాఖా మంత్రిగా పని చేసే సమయంలో బోనస్ లను ప్రకటించారని, వృద్ధాప్య పెన్షన్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారని కలెక్టర్ తెలిపారు..వివిధ సంఘాల నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్ లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి వాటి సాధనకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు..
కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య పెద్దపాడు గ్రామంలో జన్మించి మన జిల్లాకి చెదరని ముద్ర వేశారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్ట్ కు సంజీవయ్య గారు శంకుస్థాపన చేశారని, ఈ ప్రాజెక్టు వల్ల మన జిల్లాకు త్రాగు, సాగు నీటికి ఇబ్బంది లేదన్నారు. సంజీవయ్య ముఖ్యమంత్రి హోదాలో ఆనాడు పింఛన్లను కూడా అమలులోకి తీసుకొని వచ్చారని, భూమిలేని వారికి ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు కేటాయించారన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రిగా ఉంటూ హైదరాబాదులో GHMC కి, BHEL కంపెనీకి పునాదులు వేసింది కూడా దామోదర్ సంజీవయ్య అన్నారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కొరకు ఎంతో పాటుపడ్డారన్నారు.. ఆశయాలను ఆదర్శంగా తీసుకుని కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు లకు పెద్దపీట వేస్తామని ఎంపీ పేర్కొన్నారు .
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య మన కర్నూలు జిల్లా వాసి అవడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.. వారు నీతి, నిజాయితీకి మారు పేరు అన్నారు.. రాష్ట్రానికి మొదటి దళిత ముఖ్యమంత్రిగా పని చేయడంతో పాటు , అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన మొదటి దళిత నాయకుడు అన్నారు.. అదే విధంగా కేంద్ర మంత్రి గా కూడా పని చేశారన్నారు… ఎస్సీ, ఎస్టీ, బీసీ ల కొరకు ఎంతో కష్టపడ్డారని, ఎన్నో చట్టాలను కూడా తీసుకొచ్చారన్నారు.. కార్మికుల కొరకు బోనస్ తీసుకొచ్చారని, నిరుపేద ప్రజలకు ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పంచారని ఎమ్మెల్యే కొనియాడారు..ఇరిగేషన్ కి సంబంధించి జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారని, అందుకే ఆ ప్రాజెక్టుకు దామోదరం సంజీవయ్య ప్రాజెక్టు గా పేరు పెట్టారన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాలకు సాగు, త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందన్నారు.. వృద్ధాప్య పెన్షన్ వ్యవస్థను కూడా తీసుకొని వచ్చారన్నారు… అటువంటి మహానీయుడి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం కీ.శే.దామోదరం సంజీవయ్య గారి అన్న కొడుకు దామోదరం రామకృష్ణ కి సన్మానం చేశారు… అదే విధంగా వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలిచిన బహుమతులను అందజేశారు.. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి కీ.శే.దామోదరం సంజీవయ్య 104 వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి సమర్పించి, అనంతరం కలెక్టరేట్ నుండి సి – క్యాంప్ మీదుగా నంద్యాల చెక్ పోస్ట్ వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు..
కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, దూరదర్శన్ డైరెక్టర్ రంగస్వామి, వాల్మీకి సంఘ కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పోతురాజు రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మరియు సాంఘిక సంక్షేమశాఖ జెడి తులసి, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!