అభివృద్ధి కోసం అప్పులు చేయాలి.. సంక్షేమం కోసం కాదు.. జగన్‌పై మండిపడ్డ పయ్యావుల కేశవ్‌

అభివృద్ధి కోసం అప్పులు చేయాలి.. సంక్షేమం కోసం కాదు.. జగన్‌పై మండిపడ్డ పయ్యావుల కేశవ్‌

అమరావతి, న్యూస్ వెలుగు; ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్థిక ఉగ్రవాది అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. జగన్‌ ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. బడ్జెట్‌పై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బడ్జెట్‌ పెట్టలేదని వైసీపీ నేతలు పదే పదే నిలదీస్తున్నారని.. కానీ అసలు బడ్జెట్‌ పెట్టడానికి వీలు లేని విధంగా వారే ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో పాలసీలు రాష్ట్ర అభివృద్ధికి ప్రతికూలంగా పనిచేశాయని విమర్శించారు. అభివృద్ధి కోసం అప్పులు చేయాలి తప్ప సంక్షేమం కోసం అప్పులు చేయడం సరికాదని అన్నారు. 2019లో చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయిన రోజులు ఏపీకి ఉన్న అప్పులు రూ.3.75లక్షల కోట్లు అని చెప్పారు. కానీ జగన్‌ ప్రభుత్వం దిగిపోయినప్పుడు ఆ అప్పులు రూ.9.70 లక్షల కోట్లకు చేరాయని అన్నారు. తాము తీసుకొచ్చిన ప్రతి రూపాయిలో 60 శాతం మూల ధన వ్యయంగా పెట్టామని.. జగన్‌ తెచ్చిన అప్పుల్లో కేవలం 22 శాతమే మూలధన వ్యయానికి ఖర్చు చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యక్తిగత సంపదను పెంచడం మాత్రమే తెలుసునని.. రాష్ట్ర సంపదను పెంచడం వారి ఉద్దేశం కాదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎలా పిలవాలో అర్థం కావడం లేదని పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే జరిగిందని విమర్శించారు. దేనికీ సరైన లెక్కలు, జమ ఖర్చులు లేవని చెప్పారు. గత ప్రభుత్వం అంకెల గారడీతోనే అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా తప్పుదారి పట్టించిందని చెప్పారు. ఇప్పుడు అంకెల గారడీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS