
ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కడప నుండి తరలించొద్దు; సిఐటియు
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; కడప జిల్లా జమ్మలమడుగు: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను సత్వరమే ఉపసంహరించుకోవాలని సెంటర్ అఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు ఏసుదాసు కోరారు. గురువారం నాడు జమ్మలమడుగు లోని ఎల్ఐసి పక్కన ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదుట నిరసన తెలియజేసి బ్యాంకు మేనేజర్ కు వినతిపత్రం అందజేసారు.అనంతరం బ్యాంక్ దగ్గర నుండి ఆర్ డి ఓ ఆదిమూలం సాయి శ్రీ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏసుదాసు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధిని కాంక్షించి కేంద్ర ప్రభుత్వం 1976లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లను ఏర్పాటు చేసింది.అయితే వ్యాపారం పరంగా, లాభాలలో మరియు అత్యధిక నిల్వల లో దేశం లోనే అగ్ర స్థానం లో నిలిచింది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు.దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అన్నిటికి తలమాణికంగా నిలిచి,వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించినటు వంటి గ్రామీణ బ్యాంక్ ప్రధానకార్యాలయం ను తరలించడం తగదన్నారు. కేంద్రప్రభుత్వం ఒక రాష్ట్రం ఒకటే గ్రామీణ బ్యాంకు విధానంతో ఏపీజీబీ లో నూతనంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు,ఆంధ్రవికాస్ గ్రామీణ బ్యాంకు లను విలీనం చేస్తున్నారు.
ఈ కూటమి ప్రభుత్వ విధానం “కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట.” అన్నట్లుగా ఉందని ఏద్దేవా చేశారు. వెనుక బడిన ఈ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోగా ఇక్కడ ఉండే ఒకటి అర కోర ప్రభుత్వరంగ సంస్థలను కూడా ఈ రాయలసీమ ప్రాంతం నుండి తరలించి అసలే అంతంత మాత్రమే ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తోంది అన్నారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ నాయకులు వినయ్,రమేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.