
ఆరోగ్య పర్యవేక్షణకు డ్రోన్ ఆధారిత సేవలు : కలెక్టర్
న్యూస్ వెలుగు కర్నూలు, సెప్టెంబర్ 11: కర్నూలు ట్రిపుల్ ఐటీ డిఎం విద్యా సంస్థ ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని డెమో చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ట్రిపుల్ ఐటీ డిఎం ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ కు సంబంధించిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు ట్రిపుల్ ఐటి డిఎం ప్రొఫెసర్లు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను రూపొందించడం పూర్తి అయిన నేపథ్యంలో ఒక గ్రామంలో డెమో ప్రదర్శన.చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని తక్షణ వైద్య సదుపాయం అందించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. ఘటనా స్థలంలోనూ, ఆసుపత్రికి వెళ్తున్న సమయంలోను రోగుల పరిస్థితిని వైద్యులు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి, వైద్య సేవలు అందించేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు..ఈ వ్యవస్థ వైద్యులు, ఆసుపత్రుల మధ్య రియల్ టైం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పరుస్తుందన్నారు. అత్యవసర హెచ్చరికలు, గ్రీన్ ఛానల్ సమయంలో అంబులెన్స్ కు రూట్ క్లియర్ చేసేందుకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థను రూపొందిస్తున్న ట్రిపుల్ ఐటీ డిఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కె కృష్ణ నాయక్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డా. రవికుమార్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు,రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి ఖాసిఫా అంజుమ్, విద్యార్థులు పాల్గొన్నారు.