
శ్రీశైలంలో దసరా నవరాత్రి ఉత్సవాలు షురూ.. శైలపుత్రిగా దర్శనమిచ్చిన భ్రమరాంబ
శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఉత్సవాలు జరుగనుండగా.. దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో ప్రతిరోజూ అమ్మవారు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. అలాగే, ఒక్కో వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. చండీహోమం, రుద్రహోమం, జపాలు, పారాయాణలు కొనసాగనున్నాయి. గురువారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, అధికారులు ఆలయ ప్రవేశం చేయగా.. ఉత్సవాలు మొదలయ్యాయి.
దసరామహోత్సవాలలో భాగంగా కుమారి పూజలు నిర్వహించారు. పూజలో భాగంగా రెండేళ్ల నుంచి పదేళ్లలోపు వయస్సు ఉన్న బాలికకు పూలు, పండ్లు, నూతనవస్త్రాలను సమర్పించి పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇక సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. నవరాత్రి వేడుకల్లో తొలిరోజైన గురువారం అమ్మవారి శైలపుత్రి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఇక రాత్రి స్వామి, అమ్మవార్లు భృంగివాహన సేవపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అంతకు ముందు స్వామిఅమ్మవార్లకు భృంగివాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.