ప్రశాంతంగా ముగిసిన ఎల్లార్తి ఉరుసు ఉత్సవాలు
హొళగుంద న్యూస్, వెలుగు; మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో వెలసిన హజరత్ షేక్షావలి, షాషావలి దర్గాల ఉరుసు మంగళవారం జియారత్ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా అశేష జనుల మధ్య ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబిహా పర్విన్, దర్గా ఈవో షేక్ ఇమ్రాన్, ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చాముండేశ్వరి, మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా హజరత్ షేక్షావలి, షాషా వలి దర్గా ఉరుసు అశేష జనుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎల్లార్తి దర్గాల పీఠాధిపతి నూర్ బాబా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 4.30గంటలకు గంధంతో ఊరేగింపు నిర్వహించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరిగాయి అన్నారు. ఉరుసు సందర్భంగా గ్రామంలో తాగునీరు సౌకర్యం కల్పించి శానిటేషన్ వనులు చేయించినట్లు సర్పంచ్ కురువ చాముండేశ్వరి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండ గత రెండు మూడు రోజుల నుండి అన్ని వసతులు కల్పించామన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పత్తికొండ డివిజన్ డిఎస్పి వెంకటరామయ్య, ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్, హోళగుంద ఎస్ఐ బాల నరసింహులను గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.యువనేత ఎస్కే గిరి, దర్గప్ప, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ సొహెల్,గ్రామస్తుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.