ఉన్నతమైన లక్ష్యసాధన కోసం ప్రతి విద్యార్థి కృషిచేయాలి

ఉన్నతమైన లక్ష్యసాధన కోసం ప్రతి విద్యార్థి కృషిచేయాలి

ఎన్.టి.కె.నాయక్,రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య

న్యూస్ వెలుగు, కర్నూలు ఎడ్యుకేషన్ : ఉన్నతమైన లక్ష్యసాధన కోసం ప్ర తివిద్యార్థి కృషిచేయాలని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె.నాయక్ పిలుపునిచ్చారు.వర్సిటీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో శుక్రవారం పీజీ ఫ్రెషర్స్ డే కార్యక్రమం వేడుకలు ఘనంగా జరిపారు.వేడుకలకు విభిన్న ప్రాంతాలు,వివిధ నేపథ్యాలనుండి విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులు చదవడానికి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.సీనియర్ జూనియర్ విద్యార్థులు మధ్య ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలుండాలన్నారు.వర్సిటీలో చేరి ప్రతివిద్యార్థి తన కోర్సు పూర్తయి బయటికి వెళ్లే సమయానికి కుటుంబానికి అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. క్యాంపస్ లో ర్యాగింగ్ ఏరూపంలోకూడా ఉండకూడదని ఎవరైనా అనవసర విషయాల్లో తలదూరిస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందన్నారు.అలాంటి విషయాలేవైనా తమ దృష్టికి వస్తే కఠినచర్యలు తీసుకోక తప్పదని వి.సి. హెచ్చరించారు.తాను వి.సిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్సిటీలో సౌకర్యాలను మెరుగుపరచడానికి చేపడుతున్న వివిధ చర్యలను వివరించారు.వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ వర్సిటీలో క్రమశిక్షణతో మెలుగుతూ అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని
పిలుపునిచ్చారు.డిగ్రీ వరకు చదివే విధానానికి,పీజీ కోర్సులను పరిశోధనాత్మక దృష్టితో అధ్యయనం చేయడానికి తేడా ఉంటుందన్నారు.సీనియర్లతో సమన్వయంచేసుకుంటూ జూనియర్ విద్యార్థులు పురోగతి సాధించాలన్నారు. వర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం బలోపేతం కావలసిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.వర్సిటీ సైన్స్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్క విద్యార్థి తన బలాలను బలహీనతలను బేరీజువేసుకుంటూ ముందుకు సాగాలన్నారు.విద్యార్థులు అధ్యాపకులు అంతా కలిసి విశ్వవిద్యాలయాన్ని ప్రగతిపథంలో నడపాలన్నారు.అప్పుడే ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతిపైసాకూ సార్థకత చేకూరుతుందన్నారు.వర్సిటీ ఆర్ట్స్, కామర్స్,మేనేజిమెంట్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.నరసింహులు మాట్లాడుతూ విద్యార్థులమధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించడానికి ఫ్రెషర్స్ డే లాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు.వర్సిటీ డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్.భరత్ కుమార్ మాట్లాడుతూ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి యూనివర్సిటీ సరైన స్థానమని తెలిపారు. వికసిత్ భారత్ అన్న కేంద్రప్రభుత్వ లక్ష్యాన్ని,వికసిత్ ఆంధ్రప్రదేశ్ అన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి విద్యార్థులంతా కృషిచేయాలన్నారు.వర్సిటీ ఎన్.ఎస్.ఎస్.కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు మాట్లాడుతూ వర్సిటీ వైస్ ఛాన్సులర్ సహకారంతో అతితక్కువ వ్యవధిలో ఫ్రెషర్స్ డే నిర్వహణ సాధ్యమైందని వివరించారు.అనంతరం ఫ్రెషర్స్ డేను పురస్కరించుకొని నిర్వహించిన వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు జ్ఞాపికలు బహూకరించారు.వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా భాగస్వాములైనట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ఆచార్యులు, అధ్యాపకులు,విద్యార్థినీ,విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!