డిక్లరేషన్ ఎవరైనా పాటించాల్సిందే : జగన్‌కు చంద్రబాబు కౌంటర్
అమరావతి, న్యూస్ వెలుగు: ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని, వాటిని ఎవరైనా ఆచారాలను పాటించాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల , హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రమని, హిందూయేతరులు ఆలయాన్ని సందర్శించినపుడు డిక్లరేషన్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. వాటిని ఎవరైనా పాటించాల్సిందేనని వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుమల పర్యటన అభ్యంతరాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. చాలా మంది డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని గౌరవంగా దర్శించుకున్నారని అన్నారు. ఇతర మతాలను గౌరవించడం అంటే ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమేనని పేర్కొన్నారు. అన్యమతస్థుడైన డిక్లరేషన్ ఎందుకు ఇవ్వవని జగన్‌ను ప్రశ్నించారు. ఇంతకుముందు కూడా జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమల వెళ్లారని ఆరోపించారు.
తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదు..
జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయవద్దని మాత్రమే చెప్పామని వివరించారు. తిరుమలకు వెళ్లవద్దని ఎవరైనా నోటీసులు ఇచ్చారా? వెల్లడించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు.
నెయ్యి కల్తీ జరగలేదని పదేపదే అబద్దాలు ఆడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో టెండర్లలో ఉన్న నియమ నిబంధనలు మార్చి రివర్స్ టెండర్లు పిలవడంలో ఉన్న తిరకాసు ఏమిటని ప్రశ్నించారు. తక్కువ ధరకే టెండర్ ఇచ్చి నాసిరకం లేని నెయ్యిని సరఫరా చేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. వైసీపీకి రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేవు. హుందాతనం లేదు. రాజకీయాల్లో ఉండే అర్హతలేదని ఆరోపించారు. సీఎం చట్టాలను, సంప్రదాయాలను గౌరవించడంలో మొదటివ్యక్తిగా ఉండాలని సూచించారు.