తండ్రి మరణం.. కుమారుడు జననం… విది ఆడిన వింత నాటకం..
గద్వాల్ న్యూస్ వెలుగు: జీవితం హ్యాపీగా సాగిపోతుందని ఉహించుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన ఒక గంట వ్యవధిలోనే అతడి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓవైపు తండ్రి మరణం..మరోవైపు కుమారుడి జననం. ఈ హృదయవిదారక ఘటన జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకివెళ్తే.. రాజోలి మండల కేంద్రంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన కుర్వ శివ (28) గత ఒక సంవత్సరం క్రిందట బేతంచెర్ల పట్టణానికి చెందిన కుర్వ లక్ష్మితో వివాహం అయ్యింది. శివ తన కుటుంబ పోషణ కోసం పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నాడు. లక్ష్మి గర్భం దాల్చడంతో వారి పుట్టింట్లో ఉంటూ..మంగళవారం లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మంగళవారం రాత్రి తుమ్మలపల్లి గ్రామం నుండి శివ తన వ్యక్తిగత పనుల కోసం ద్విచక్ర వాహనంపై రాజోలికి వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదవశత్తు బైకు అదుపుతప్పడంతో శివ తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 1 గంటలకు మృతి చెందాడు. మరోవైపు 2 గంటలకు తన భార్య లక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త చనిపోయిన విషయం చెబితే లక్ష్మికి ఏమవుతుందోనని కుటుంబసభ్యులు ఆమెకు చెప్పలేదు. కర్నూలు జిల్లా నుంచి శివ మృతదేహాన్ని రాజోలికి తరలించి ఆమెకు తెలియకుండానే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తన భర్త చనిపోయాడన్న విషయం తెలియని లక్ష్మికి కొడుకు పుట్టిన ఆనందంలో మునిగిపోయింది. శివ ఎప్పుడు వస్తాడా.. అతడికి ఎప్పుడు బాబును చూపించాలా.. అని ఆమె ఆసుపత్రిలో ఎదురుచూస్తోంది. ఆమె పరిస్థితి చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతుడి తండ్రి కుర్వ పెద్ద మద్దిలేటి ఫిర్యాదు మేరకు రాజోలి ఎస్‌ఐ జగదీశ్వర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.