ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ స్కీమ్‌.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ స్కీమ్‌.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

  అమరావతి ; ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రేషన్‌ కార్డు దారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

దీపావళి సందర్భంగా ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రేషన్‌కార్డు దారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందులో ఒక్క సిలిండర్‌ రాయితీకి సంబంధించిన రూ.895 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి వీరపాండియన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులను గ్యాస్‌ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ తెరిచిన అకౌంట్‌లో జమచేయనున్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు రూ.2684 కోట్ల వ్యయం అవుతుందని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఈ రాయితీలకు సంబంధించి చెల్లింపుల కోసం ఇప్పటికే గ్యాస్‌ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా ఒక అకౌంట్‌ను తెరిచింది. ఆ అకౌంట్‌లోనే ఇవాళ విడుదల చేసిన రూ.895 కోట్ల నిధులను జమ చేయనున్నారు. కాగా, ఈ రాయితీ డబ్బులను ముందుగా పట్టణాల్లోని వారికి చెల్లించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని వారికి చెల్లించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వారి అకౌంట్లలోకి 48 గంటల్లో రాయితీ డబ్బులు పడతాయని సమాచారం.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS