వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి విడదల రజిని రాజీనామా చేశారా..?
అమరావతి; ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి పోతున్నారు. పార్టీలో ఉన్నంతసేపు క్రమశిక్షణ గల నాయకులుగా చెప్పుకుంటూ తర్వాత ప్లేటు ఫిరాయిస్తున్నారు. జగనన్న పేదల మనిషి అని పొగిడిన నాయకులు ఉన్నట్టుండి పార్టీ నుంచి బయటపడుతున్నారు. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజినీ పార్టికి రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వెలుగు వెలిగిన విడదల రజిని పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలే వెల్లడించాయని ప్రచారం జరుగుతోంది. అయితే రజిని మాత్రం ఆమె రాజీనామా విషయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. ఈ క్రమంలో జగనన్న అంతటి మంచి నాయకుడు లేడని పొగిడిన రజిని ఎందుకు మనసు మార్చుకున్నారనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆమెను చిలకలూరి పేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయించారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓటమిలో భాగంగా ఆమె కూడా ఓడిపోయారు. అయినా జగన్ ఏర్పాటు చేసిన ప్రతి సమావేశానికి క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. వైఎస్సార్‌సీపీ యాక్టివ్ పాలిటిక్స్‌లో రజిని చురుకుగా ఉంటున్నారు. విదేశాల్లో ఉంటూ రాజకీయాలపై మోజుతో ఎమ్మెల్యేగా గెలిచిన రజినికి పార్టీ కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో రజిని రాజీనామా వెనుక మతలబు ఏమిటనేది సస్పెన్స్‌గా మారింది.