
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లను.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ఐదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. నాటి ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే ఓటర్లు పరిమితం చేశారు.
చంద్రబాబు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఇప్పటి వరకు రెండుసార్లు జరుగగా ఒకసారి ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. ఆతరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుకాలేదు. కొద్దిరోజుల్లో జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు అవుతారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో మీడియా సమావేశంలో గురువారం క్లారిటీ ఇచ్చారు.
గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని మరోసారి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న ఆందోళనతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేనప్పడు అసెంబ్లీ సమావేశాలకు పోవడం ఏం ఉపయోగమని స్పష్టత నిచ్చారు. ఇకపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వెల్లడించారు.