రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందించాలి

రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందించాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; నీటి లభ్యత వున్నప్పటికీ ప్రాజెక్టుల నిర్మాణ, నిర్వహణలో సమతుల్యం పాటించకపోవడం వలన రాయలసీమ వ్యవసాయ యోగ్యమైన భూమిలో కేవలం 9 శాతం భూభాగానికి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు లభిస్తుండటంతో నిత్యం కరువు బారిన పడుతున్న రాయలసీమలో జలసంరక్షణ ఆవస్యకతను వివరిస్తూ పుస్తక రూపంలో ముఖ్యమంత్రి  వ్రాసిన విజ్ఞాపన పత్రాన్ని బొజ్జా దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్  అందజేశారు.వంద రోజులుగా నిరంతరాయంగా కృష్ణా, తుంగభద్ర నదులలో ప్రవహిస్తున్న జలాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల దుస్థితిపై వివిధ దినపత్రికల నియోజకవర్గ/ జిల్లా ఎడిషన్లలో వచ్చిన వార్తలు, పాలకుల హామీలు, ప్రజల ఆకాంక్షల కూర్పుతో రూపొందించిన పుస్తకంలోని అంశాలను కలెక్టర్ కి వివరించామని బొజ్జా పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల దుస్థితికి గల కారణాలను ప్రభుత్వం సులభంగా అర్థం చేసుకోవడానికి రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతుల ఆధారంగా “బ్రాడ్” గా శిథిల విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు, అసంపూర్ణ విగ్రహాలు, శైశవదశ విగ్రహాలు, జీవచ్ఛవ విగ్రహాలు, ఆశావహ  స్వప్న విగ్రహాలుగా చేసిన వర్గీకరణను ఈ పుస్తకంలో వివరించామని బొజ్జా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సగటున 30 శాతం భూమికి సాగునీరు లభిస్తున్నదని, కానీ రాయలసీమలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కేవలం 9 శాతం భూమికి మాత్రమే సాగునీరు లభిస్తున్న విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ ప్రాజెక్టుల నిర్మాణ, నిర్వహణలో సమతుల్యం పాటించకపోవడం వల్ల రాయలసీమ వ్యవసాయ యోగ్యమైన భూమిలో కనీసం 30 శాతానికి కూడా సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితి వలన ఈ ప్రాంతం కరువు పీడిత ప్రాంతం క్యాటగిరిలోకి నెట్టివేయబడిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.‌ పైన వివరించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని రాయలసీమ వ్యవసాయ యోగ్యమైన భూమిలో కనీసం 30 శాతానికైనా సాగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందిని ఆయన పేర్కొన్నారు. దీని కోసం రాబోయే ఐదు సంవత్సరాలలో సుమారు 35 వేల కోట్ల రూపాయల నిధులను రాయలసీమ ప్రాజెక్టుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయిస్తే రాయలసీమలో శాశ్వతంగా కరువును, వలసలను నిర్మూలించవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ యోగ్యమైన భూమిలో రాయలసీమకున్న 42 శాతానికి సమానంగా నైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో 42 శాతం నిధుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి క్రిషి సించాయి యోజన, స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిధులు, ప్రపంచ బ్యాంకు నుండి నిధులు, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రత్యేక ప్యాకేజీ నిధులను కూడా సాధించి రాయలసీమ సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని కోరామని తెలిపారు.‌ ప్రభుత్వ సంకల్పం “రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు” సిద్ధించే దిశగా రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో నిధులు కేటాయింపులను ఆశిస్తున్నాం అని బొజ్జా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాయలసీమ సాగునీటి సమస్యల పరిష్కార దిశగా సమితి అందచేసిన నివేదికను, విజ్ఞాపన పత్రాన్ని ప్రభుత్వానికి నివేదించడానికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారికి బొజ్జా ధన్యవాదాలు తెలియజేశారు . బొజ్జా దశరథరామిరెడ్డి తో పాటుగా సమితి ఉపాధ్యక్షులు వై యన్ రెడ్డి, కార్యదర్శి మహేశ్వర రెడ్డి, పౌరసంబంధాల కార్యదర్శి నిట్టూరు సుధాకర్ రావు, సభ్యులు సాకేస్వర రెడ్డి కలెక్టర్ ని కలిసారు‌‌

Author

Was this helpful?

Thanks for your feedback!