
నేత్రపర్వంగా జగదభి రాముని పౌర్ణమి పరిణయం
అధిక సంఖ్యలో సీతారామ పౌర్ణమి కళ్యాణానికి భక్తులు హాజరు
న్యూస్.వెలుగు,ఒంటిమిట్ట; రెండవ అయోధ్య ఆంధ్ర భద్రాచలం ఏకశిలానగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సోమవారం పుష్యమాస పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు టీటీడీ నేతృత్వంలో ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ సీతారామ పౌర్ణమి కళ్యాణం నిర్వహించారు. ముందుగా ఆలయ పర్యవేక్షకులు ఆలయంలోని కళ్యాణ వేదిక మంటపాన్ని మామిడి తోరణాలతో, అరటి పిలకలతో, పలు రకాల పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు శ్రీ సీతారామ ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో, పలు రకాలైన కనక భూషణ, పుష్ప తరువులతో శోభాయ మానంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను గావించారు. పాంచరాత్ర ఆగమం ప్రకారం వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో ఆలయ స్వస్తి పుణ్యా వచనం, విశ్వక్సేనుని ఆరాధన, శ్రీ సూక్త ,పురుష సూక్త ,విష్ణుసూక్త ,లక్ష్మీ సూక్త ప్రకారంగా స్వామివారికి నూతన యజ్ఞోపవీత దారణ, కంకణ ధారణ, కళ్యాణ ఘట్టంలో అత్యంత ప్రధానమైన జిలకర బెల్లం మిళిత పూర్వకంగా లగ్న ఘట్టం, స్వామి అమ్మవార్ల యొక్క వంశవృక్ష ప్రకరణము, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, మహా కలశ పూజ ,మాంగల్య పూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కళ్యాణ ఘడియలు సమీపిస్తుండడంతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ధనుర్భాణాలంకరణ శోభితుడైన శ్రీరామచంద్రుని పరమ పవిత్రమైన కరముల స్పర్శతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిమద్యాంత స్వరూపిణి లోకమాత అయోనిజ (సీతాదేవి) మెడలో అర్చకులు భక్తిశ్రద్ధలతో మాంగల్య దారణ గావించారు. సీతారామ కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించుటకు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తండోపదండాలుగా ఆలయానికి వచ్చి శ్రీ కోదండ రామస్వామి కళ్యాణంలో పాల్గొని ఆ మంగళ మూర్తిని స్మరించి తరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీటీడీ వారు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయమంతా రామనామ సంకీర్తనలతో మార్మోగింది..