సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ఉద్యమాలే మార్గం
న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక తొమ్మిదవ వార్షికోత్సవ సదస్సు నేడు కర్నూల్ లోని వెంగన్న బావి వద్ద గల విజయవనం లో జరిగింది. కన్వీనర్ అధ్యక్షత వహించిన ఈ వార్షిక సదస్సులో వేదిక భాగస్వామ్య సంఘాల నాయకులు హాజరై వేదిక గత ఏడాది కాలంగా నిర్వహించిన కార్యక్రమాలపై చర్చించారు. వేదిక ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో అంశాలపై ఉద్యమాలను నిర్వహించిందని, K.C. కెనాల్ , హంద్రీ నది లో పూడిక తీసివేయించడానికి కృషి చేసిందని, కర్నూల్ పశ్చిమ ప్రాంతం లో యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించిందని, కొంత మేరకు విజయం సాధించిందనీ అభిప్రాయ పడ్డారు.ముఖ్య వక్తాలుగా జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డా. బ్రహ్మారెడ్డి, సీనియర్ అడ్వకేట్ మనోహర్ హాజరయ్యారు. ‘ ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉమ్మడి ఉద్యమాల ఆవశ్యకత ‘ ఐ పీ సి చట్టాల సవరణ – వాస్తవ పరిస్థితి ‘ అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా డా. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా దేశంలో ధరలు, నిరుద్యోగం పెరిగిపోయాయని, కార్పొరేట్ శక్తులే ప్రభుత్వాలను నడిపిస్తున్నాయని,ప్రజా సమూహాలపై అణిచి వేత ఎక్కువైపోయిందని తెలిపారు. ప్రభుత్వం లోని సకల వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూడా తన విధానాలకు అనుగుణంగా సవరించుకుంటూ ఉందని, ఇది మరింత ప్రమాదకరమని తెలిపారు. అందువల్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను సమైఖ్య ఉద్యమాల ద్వారానే ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు. ఈ నాటి వేదిక వార్షికోత్సవం సదస్సులో వేదిక కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, రైతుకూలీ సంఘం నాయకుడు సుంకన్న, సీపీఐ నాయకులు రామకృష్ణారెడ్డి, రత్నం ఏసేపు, మనోహర మాణిక్యం, సుబ్బరాయుడు, చాంద్ బాషా, వకిల్ అహ్మద్, ప్రతాప రెడ్డి, రవికుమార్, డేవిడ్, శేషగిరి, రామాంజనేయులు, సురేష్, పాల్గొని ప్రసంగించారు.