పారామెడికల్ కళాశాలలో జ్యోతిరావు పూలే వర్దంతి కార్యక్రమం
న్యూస్ వెలుగు, కర్నూలు; మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ని కర్నూలు లోని జయలక్ష్మి ఇన్సిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ సైన్సెస్స్ కళాశాలలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, యం.ఎస్.పీ నగర అధ్యక్షుడు పాముల కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పాముల కుమార్, కళాశాల కరస్పాండెంట్ మల్లికార్జున పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మల్లికార్జున మాట్లాడుతూ జ్యోతిరావు పూలే స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మహిళలల చదువు కోసం పాఠశాలను ఏర్పాటు చేసి తన భార్య అయిన సావిత్రి భాయ్ పూలేను ఉపాధ్యాయురాలిని చేశారన్నారు. ఇంట్లో మహిళ చదువుకుంటే ఆఇల్లు అభివృద్ధి చెందుతుందని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. విద్యతో పాటు అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారని మల్లికార్జున తెలిపారు. వితంతు వివాహాలను సైతం ఆయన ప్రోత్సాహించారన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ నగర అధ్యక్షుడు పాముల కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలేను అందరూ ఆదర్శంగా తీసుకుని చదువుల్లో రాణించాలని కోరారు. ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే మహత్మ జ్యోతిరావు పూలే కారణమని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే సమాజం బాగుపడుతుందని అప్పట్లోనే గుర్తించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాముల కుమార్, కరస్పాండెంట్ మల్లికార్జున, డైరెక్టర్ పవన్ కుమార్, బీసీ. నాయకులు ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.