రామాయణంలోని మహాకావ్యాలను ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ వెలుగు; వాల్మీకి రచించిన రామాయణ మహా కావ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు.గురువారం వాల్మీకి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మహాకవి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ముస్తఫా అహ్మద్ తదితరులు వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని అందరి సమక్షంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబం ఎలా ఉండాలి, సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి, సమాజం ఒక సన్మార్గంలో నడవడానికి ఎటువంటి ఆచరణలు ఉన్నాయన్న విషయాలు రామాయణంలో చక్కగా ప్రస్ఫుటించారని వీటన్నింటినీ ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కలెక్టర్ సూచించారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని దేశమంతా రామాయణంలోని శ్లోకాలను పఠిస్తూ శోభాయాత్ర నిర్వహించుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు.