జనాభా సంక్షోభం!
భారత్‌లో వేగంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు
2050 నాటికి 1.29కు తగ్గనున్న ఫెర్టిలిటీ రేట్
ఇప్పుడు జపాన్ పరిస్థితే 30 ఏండ్ల తర్వాత మనకూ..
దేశంలో భారీగా పెరిగిపోనున్న వృద్ధుల జనాభా
న్యూఢిల్లీ, : ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం మనదని గొప్పగా చెప్పుకుంటాం. ‘యువ భారతం’గా మన దేశాన్ని పిలుచుకుంటాం. ఒళ్లొంచి పని చేసే యువ జనాభా ఎక్కువగా ఉండటమే భారత్ బలం. అయితే, ఈ బలం భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇప్పటి ‘యువ భారతం’ మూడు దశాబ్దాల తరువాత ‘వృద్ధ భారతం’గా మారబోతున్నది. జనాభా రేటు తగ్గిపోయి, వృద్ధుల జనాభా పెరగడం వల్ల ఇప్పుడు జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఆ దేశాల అభివృద్ధికి ఇది అడ్డంకిగా మారుతున్నది. ఇదే పరిస్థితి 30 ఏండ్ల తర్వాత మన దేశానికీ ఎదురుకాబోతున్నది. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండనుంది.
భారీగా పడిపోయిన సంతానోత్పత్తి రేటు
ఒక మహిళ 15 ఏండ్ల నుంచి 49 ఏండ్ల మధ్య వయసులో జన్మనిచ్చే పిల్లల సంఖ్య సగటును సంతానోత్పత్తి రేటుగా లెక్కిస్తారు. 1950లో దేశంలో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉండేది. అధిక జనాభా కారణంగా ఆహార కొరత వంటి సమస్యలు తలెత్తడంతో 1951 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇద్దరిని మించి కనవద్దని అవగాహన కల్పించారు. దీంతో క్రమంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వచ్చింది. ఈ తగ్గుదల మరీ ఎక్కువ కావడమే ఇప్పుడు సమస్యగా మారింది. జనాభా తగ్గొద్దంటే సంతానోత్పత్తి 2.1గా ఉండాలి. మన దేశంలో సంతానోత్పత్తి రేటు వేగంగా ఈ రీప్లేస్‌మెంట్ స్థాయికి దిగువకు పడిపోతున్నది. దేశంలోని 36 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 31లో సంతాన రేటు 2.1కు, అంతకు దిగువకు పడిపోయింది. బీహార్, యూపీ, జార్ఖండ్, మేఘాలయ, మణిపూర్ మాత్రమే ఎగువన ఉన్నాయి. 2019-21కి దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0తో రీప్లేస్‌మెంట్ స్థాయికి దిగువకు తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది.
తేరుకోకపోతే సంక్షోభమే
భారత్‌లో సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి 1.29కు పడిపోతుందని ఇటీవల లాన్సెట్ జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. అంటే, మరో మూడు దశాబ్దాల్లో దేశంలో వృద్ధుల జనాభా భారీగా పెరగడంతో పాటు మొత్తం జనాభా సంఖ్య తగ్గిపోనున్నది. ఇదే జరిగితే దేశానికి బలంగా ఉన్న శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. వృద్ధుల జనాభా పెరగడం వైద్య సేవలు, పింఛన్ల వ్యవస్థపై భారం పెంచుతుంది. కాగా, జీవన వ్యయం పెరిగిపోవడం వల్ల ఒకరిని మించి పిల్లలను కనేందుకు యువ దంపతులు వెనకాడటం సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ప్రధాన కారణం. వివాహాలు ఆలస్యంగా చేసుకుంటుండటం, మానసిక ఒత్తిడి, జీవనశైలి, వాతావరణ సంబంధ సమస్యల వల్ల వంధ్యత్వం పెరగడం కూడా కారణమే. భారత్‌లో ఇప్పటికీ యువ జనాభా ఎక్కువ కాబట్టి వెంటనే అప్రమత్తమైతే భవిష్యత్తులో తలెత్తే సంక్షోభాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.