ఏపీలో ఈనెల 10 నుంచి మళ్లీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
అమరావతి, న్యూస్ వెలుగు: ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 10 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఆదివారం ఏలూరు , తూర్పుగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, ఎన్టీఆర్, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజమహేంద్రవరంలో 53 మి.మీ. వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది.
కావలిలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలుగా నమోదైంది. కావలి, విశాఖపట్నం, తుని, కాకినాడ, నెల్లూరు, కడప, అనంతపురం, నందిగామ, నరసాపురం, తిరుపతి, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి.