
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం : ఎంపీ
Nellore News Velugu : దేశమంతా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమవుతోందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విమర్శించారు. నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంపీ నేతృత్వంలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యంగం పటిష్టంగా వుండడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, ఆయన్ను అవమానించేలా రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతోందని గురుమూర్తి విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి, అవినీతి రాజ్యమేలుతున్నాయని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని అవమానించేలా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ రోజు ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటు వేస్తేనే ఊళ్లలో ఉండాలని , లేదంటే అన్నీ విడిచిపెట్టి వెళ్లిపోవాలని దాడులకు పాల్పడ్డారన్నారు. ఇలాంటి ఘటనలపై కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించినట్టు ఎంపీ గురుమూర్తి తెలిపారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే వాటిని కూడా తప్పుదారి పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇస్తోందని విమర్శించారు. బీఆర్ అంబేద్కర్ కలలు గన్న సమాజాన్ని ఏర్పాటు చేసుకోడానికి వైఎస్సార్‌సీపీ తరపున సర్వశక్తులు ఒడ్డి పోరాడుతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చంద్రశేఖరరెడ్డి, మేరుగ మురళీ, వైసీపీ నాయకుడు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.