పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలి
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో ప్రతి వీధిన పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తెల్లవారుజామున బళ్ళారి చౌరస్తా, నరసింహా రెడ్డి నగర్, రోజ స్ట్రీట్, పాత ఈద్గా, సంపత్ నగర్, గాంధీ నగర్, పాత కంట్రోల్ రూం, తదితర ప్రాంతాల్లో కమిషనర్ విసృతంగా పర్యటించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నగరంలో ప్రతి వీధిన చివరి వరకు పారిశుద్ధ్య పనులను చేపట్టాలని, ప్రతి రెండు వారాలకు ఒకసారి తప్పనిసరిగా పూడికతీత పనులు చేపట్టాలని కమిషనర్ పారిశుద్ధ్య తనిఖీదారులకు సూచించారు. పూడికతీత పనుల అనంతరం వాటి వ్యర్థాలను ఎప్పటికప్పుడు డంప్ యార్డుకు తరలించాలని, ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులు నిర్వహించే క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత తనిఖీదారుడిదే బాధ్యతన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్యధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, పారిశుద్ధ్య తనిఖీదారులు ముంతాజ్ వలి, మునిస్వామి, అనిల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.