FlatNews Buy Now
10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

నంద్యాల, న్యూస్ వెలుగు : ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని సకాలంలో, సమర్థవంతంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలలో కనీసం 95 శాతం వరకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,

అర్జీలను కేవలం ముగించడం కాకుండా, సమస్య మూలాన్ని గుర్తించి శాశ్వత పరిష్కారం చూపడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం అందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. 95 శాతం పరిష్కార లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా త్వరలోనే 100 శాతం లక్ష్యాన్ని సాధించేలా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రీ-ఆడిట్ పురోగతి వివరాలు
ప్రీ-ఆడిట్ ప్రక్రియలో భాగంగా జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన మొత్తం 42,258 అర్జీలను పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. అందులో 30,798 (72.88%) అర్జీలను ప్రీ-ఆడిట్ చేయగా, వాటిలో 27,365 (88.85%) అర్జీలకు సరైన విధంగా పరిష్కారం చూపినట్లు వెల్లడించారు. అయితే 3,433 (11.15%) అర్జీలలో లోపాలు ఉన్నట్లు గుర్తించబడినట్లు పేర్కొన్నారు. ఈ లోపాలను తగ్గించి, పరిష్కారాల నాణ్యతను మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో విశేషంగా పనిచేసిన 10 మంది అధికారులను గుర్తించి కలెక్టర్ అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, బాధ్యతాయుతంగా వ్యవహరించిన అధికారులను ఆదర్శంగా తీసుకోవాలని ఇతరులకు సూచించారు. అదే సమయంలో, అర్జీలను నిర్లక్ష్యంగా పరిష్కరించిన లేదా సరైన విధంగా స్పందించని 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారిని ఆదేశించారు. ప్రజా సేవలో నిర్లక్ష్యానికి తావు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
పీజీఆర్‌ఎస్ ద్వారా 296 అర్జీల స్వీకరణ
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పీజీఆర్‌ఎస్ ద్వారా మొత్తం 296 అర్జీలు స్వీకరించబడ్డాయన్నారు. ఈ అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, నిర్దిష్ట గడువులో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
1)బండి ఆత్మకూరు మండలానికి చెందిన సయ్యద్ జీనత్ బీకు సంబంధించిన భూమిపై సివిల్ కోర్టు ద్వారా తీర్పు వెలువడిన నేపథ్యంలో, రాజారెడ్డి అనే వ్యక్తి ఆ భూమిలో 69 సెంట్లు ఆక్రమించాడని ఫిర్యాదు అందింది. ఈ విషయంపై ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసి, హియరింగ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని బండి ఆత్మకూరు తహశీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.
2) జూపాడుబంగ్ల మండలం బన్నూరు గ్రామానికి చెందిన రాణెమ్మ తనకు సర్వే నెం. 751-సి3లో భూమి ఉన్నప్పటికీ, ఆ భూమికి రహదారి (రాస్తా) సౌకర్యం లేకపోవడం, కాలువ సౌకర్యం కూడా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. అలాగే పారుమంచాల గ్రామంలో ఉన్న తన భూమికి కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లు తెలియజేశారు. ఈ అంశాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జూపాడుబంగ్ల తహశీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు.
3) జూపాడుబంగ్ల మండలం పారుమంచాల గ్రామానికి చెందిన సి. సురేష్, సర్వే నెం. 826/2లో 5 సెంట్లు, 826/3లో 5 సెంట్లు, 827/1లో 3.45 సెంట్ల భూమి ఉన్నప్పటికీ, వాటిని చుక్కల భూమిగా నమోదు చేస్తున్నారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు. ఈ విషయంపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్స్ – భూ సమస్యలకు సమగ్ర పరిష్కారం భూ సంబంధిత సమస్యలను సమగ్రంగా, వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి తక్షణ పరిష్కారం అందించే విధంగా ఈ క్లినిక్స్ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 164 అర్జీలు స్వీకరించబడ్డాయని, వాటిలో…రెవెన్యూ / గ్రామ-వార్డు సచివాలయ సేవలు -5, అడంగల్ సవరణలు – 33,  చుక్కల భూములు & 22-ఎ సమస్యలు – 28, అసైన్డ్ భూములు, ఆక్రమణలు -11, రెవెన్యూ కోర్టు / ఆర్‌ఓఆర్ అంశాలు – 30, సర్వే, రీ-సర్వే సమస్యలు – 48, దేవాదాయ, వక్ఫ్ భూములు – 9 వున్నాయని కలెక్టర్ వివరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS