తెలుగు సినీ పరిశ్రమ విజయవాడకు తరలి రావాలి : మంత్రి కందుల దుర్గేశ్‌

తెలుగు సినీ పరిశ్రమ విజయవాడకు తరలి రావాలి : మంత్రి కందుల దుర్గేశ్‌

విశాఖపట్నం ; ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుస్థిర పర్యాటకంపై దృష్టిసారిస్తోందని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. రాష్ట్రంలోని ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం & ట్రావెల్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు.

సినిమాల చిత్రీకరణ జరిగితే రెవెన్యూ పెరుగుతుందని మంత్రి చెప్పారు. టికెట్ల ధరలు పెంచాలని అడుగుతున్నారని, తెలుగు సినిమాలకు తప్పకుండా సహకారం అందిస్తామని, అంతకంటే ముందు చిత్ర పరిశ్రమ విజయవాడకు తరలివస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, అందుకే పీపీపీ విధానంపై దృష్టిపెడుతున్నామని తెలిపారు. అందరి సలహాలు తీసుకొని అందరికీ అనుకూలంగా ఉండేలా త్వరలో టూరిజం పాలసీ తీసుకొస్తామని చెప్పారు.

స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రాష్ట్రానికి త్వరలో రూ.1000 కోట్లు కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి దుర్గేశ్‌ చెప్పారు. రాష్ట్రంలో భారీ తీర ప్రాంతం ఉన్నా బ్లూ ఫాగ్ బీచ్ ఒక్కటే ఉందని అన్నారు. మిగిలిన బీచ్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాలపై అందరూ కలసి ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతాల అసలైన పేర్లను సినిమాల్లో ప్రస్తావించాలన్నారు. అప్పుడే ఈ ప్రాంతాల గురించి అందరికీ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.

Author

Was this helpful?

Thanks for your feedback!