విశాఖ స్టీల్‌లో కార్మికుల తొలగింపునకు నిరసనగా కొనసాగుతున్నఆందోళన
విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పట్ల కార్మికులు కొనసాగిస్తున్న నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రద్దు చేసిన గేటు పాస్‌లను పునరుద్ధరించాలని కోరుతూ సుమారు 4వేల మంది కార్మికులు ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బయోమెట్రిక్ యంత్రంలో తొలగించిన కార్మికుల వివరాలు తిరిగి నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ప్లాంటులో 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా అందులో నాలుగు వేల మందిని తొలగించేందుకు యాజమాన్యం సిద్ధం కావడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులతో అధికారులు చర్చలు జరిపినా డిమాండ్‌లను యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు ఉద్యోగ సంఘ నాయకులు మద్దతు తెలిపి కార్యాలయం ముందు బైఠాయించారు.
కాంట్రాక్టు కార్మికుల విషయంలో యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. యాజమాన్యం చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికుల విషయంలో కుట్ర జరుగుతుందన్నారు.