
ఆచార్య చెన్నారెడ్డిని అభినందించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్
న్యూస్ వెలుగు గుంటూరు : తెలుగు నవలా సాహిత్యంలో ద్వితీయ పురుష శైలి లో ‘స్వప్న సాగరం’ నవలా రచనచేసిన ఆచార్య గుజ్జు చెన్నారెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి అభినందించారు. “స్వప్న సాగరం” ను అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె మధుమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఉద్యోగాన్ని కాదని ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆచార్యునిగా సేవలందిస్తూ తన రచనలతో సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ,పాఠ్య బోధనలతో విద్యార్థులను విజ్ఞానవంతులుగా మలుస్తున్న ఆచార్య గుజ్జు చెన్నారెడ్డి సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. భవిష్యత్తులో ఆంగ్లములో ఉన్న పాఠ్యపుస్తకాలను సైతం తెలుగులోకి అనువదించి విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేలా ఆచార్య జి చెన్నారెడ్డి కృషి చేయాలని ఆచార్య కె మధుమూర్తి ఆకాంక్షించారు. నూతన జాతీయ విద్యా విధానం 2020లో భారతీయ భాషల మీద ప్రత్యేక శ్రద్ధ ఉందని ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు.ఆచార్య చెన్నారెడ్డి రెండు పీ హెచ్ డీ లు చేసి,215 పరిశోధక వ్యాసాలు రాసి తన ఆధ్వర్యంలో 42 డాక్టరేట్లను పూర్తి చేయించడం గమనిస్తే విద్యారంగం పై మక్కువతో ఆయన చేస్తున్న సేవలు అనన్య సామాన్యం అని కొనియాడారు.ఆచార్య జి చెన్నారెడ్డి భవిష్యత్తులో సమాజానికి స్ఫూర్తిని ఇచ్చేలా మరెన్నో రచనలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె మధుమూర్తి అభిలషించారు.