ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసమున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలునగరంలోని వివిధ సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న పేదలందరికీ తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య , సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప, సీనియర్ నాయకులు కె. జగన్నాథం, నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి కోరారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య వినతి పత్రం తో పాటు లబ్ధిదారుల యొక్క దరఖాస్తులు అందజేశారు. కర్నూలు నగరానికి గత 15 సంవత్సరాల క్రితం అనేక గ్రామాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వచ్చి నగరంలో భవన నిర్మాణం,మట్టిపని,హమాలి,ఆటో,సెంట్రింగ్,ప్లంబర్ హాస్పిటల్ మరియు హోటల్లో కార్మికులుగా పనులు చేసుకుంటూ, చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటూ ఇంటి అద్దెలు చెల్లించుకోలేక, వేల కుటుంబాల సొంత ఇంటి స్థలం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గతంలో వారికోసం గత ప్రభుత్వాలు జగన్నాథ గట్టులో ఇందిరమ్మ గృహాల పేరుతో 8,000 ఇళ్ల నిర్మాణం చేపట్టారు కానీ, వాటిని పూర్తిగా నిర్మించి, లబ్ధిదారులకు అందజేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. నగరంలోని రింగ్ రోడ్డు సమీపంలో టిట్కో గృహాలు దాదాపు 10,800 వందల ఇళ్లను నిర్మించారు కానీ, లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందించలేదని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం నగరంలోని పేదలకు ఒక సెంటు స్థలం ఇచ్చింది కానీ, ఇంటి నిర్మాణాన్ని చేపట్టలేదని అన్నారు. ఇచ్చిన సెంటు స్థలాన్ని కూడా కర్నూల్ నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో జన సంచారం లేని ప్రాంతంలో, నివాసయోగ్యంగా లేని ప్రాంతంలో స్థలాలు కేటాయించారని స్థలాలు కేటాయించాలని, వీటివల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగం లేదని, గతంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార మేనిఫెస్టోలో టిడీపీ అధికారంలోకి వస్తే ఇంటి స్థలాలు లేని నిరుపేదలందరికీ రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం అవసరమయ్యే సామాగ్రిని ప్రభుత్వమే ఇస్తుందని ఇచ్చిన హామీని తక్షణమే అమలుపరచాలని తెలిపారు.