
ఇండస్ట్రియల్ ఆల్కహాల్‌పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలదే.. తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం
నేషనల్ ; ఇండస్ట్రియల్ ఆల్కహాల్‌పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకే ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలురించింది. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. రాష్ట్రాలకు ఈ విషయంలో ఉన్న అధికారాన్ని తొలగించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తిపై నియంత్రణపై అధికారం కేంద్రానికి లేదని ధర్మాసనం పేర్కొంది. తొమ్మిది మంది సభ్యులులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 8:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది. అయితే, సింథటిక్స్, కెమికల్స్ కేసులో 1990లో ఏడుగురు సభ్యుల బెంచ్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తిని నియంత్రించే హక్కు కేంద్రానికి ఉందని తీర్పు ఇచ్చింది.
2010లో ఈ అంశాన్ని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి సమీక్ష కోసం పంపారు. ధర్మాసనం ‘ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మానవ వినియోగం కోసం కాదు’ అని తీర్పు సందర్భంగా పేర్కొంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లోని రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 8 ఆల్కహాల్ తయారీ, రవాణా, కొనుగోలు, విక్రయాలపై చట్టాలను రూపొందించే హక్కు రాష్ట్రాలకు కల్పిస్తుందని బెంచ్ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర శాసనసభలు రెండూ ఉమ్మడి జాబితాలోని విషయాలపై చట్టాలను రూపొందించే హక్కును ఉంటాయని.. అయితే రాష్ట్రచట్టం కంటే కేంద్ర చట్టానికి ప్రాధాన్యం ఇవ్వాలనే నిబంధన ఉన్నది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ రిషికేష్ రాయ్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ ఉన్నారు. బెంచ్‌లో జస్టిస్ బీవీ నాగరత్న మిగతా న్యాయమూర్తులతో వ్యతిరేకించారు.