లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
అత్యంత నాణ్యత ప్రమాణాలతో లడ్డు ప్రసాదం తయారీ
మూలా నక్షత్రం రోజు కోసం రెండున్నర లక్షల లడ్డూలు సిద్ధం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, న్యూస్ వెలుగు; లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని.. అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అమ్మవారి లడ్డు, అన్న ప్రసాదాలను తయారు చేయడంతో పాటు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అవసరమైన లడ్డూలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ బ్రాహ్మణ వీధిలో నిర్వహిస్తున్న లడ్డూ ప్రసాద తయారీ కేంద్రం (లడ్డూ పోటు), అన్న ప్రసాద తయారీ కేంద్రాలను కలెక్టర్ సృజన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన అమ్మవారి లడ్డు ప్రసాదాల తయారీలో అత్యంత నాణ్యత ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రసాదం తయారీకి విజయ నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు శాంపిల్స్ ను పరీక్షలు నిమిత్తం ల్యాబ్ కు పంపడం జరుగుతోందని, ఫలితాలను నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
లడ్డు పోటు,అన్న ప్రసాద తయారీకి వినియోగించే ముడి సరుకులు, ద్రవ్యాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఫుడ్ సేఫ్టీ ఎస్వోపీ ప్రకారం ధ్రువీకరించిన మేరకు నాణ్యమైన ముడి సరుకులను వినియోగిస్తున్నారని, తయారీ విధానంలో జాగ్రత్తలు పాటిస్తున్నారన్నారు. నవరాత్రి ఉత్సవాలలో ఇప్పటివరకు ప్రతిరోజు 60 నుంచి 70 వేల వరకు లడ్డూలను విక్రయిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా నవరాత్రి ఉత్సవాలలో 25 లక్షల లడ్డూలు విక్రయించే అవకాశం ఉందన్నారు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల సంఖ్య అసాధారణ స్థాయిలో ఉంటుందన్నారు. అదే సమయంలో లడ్డు ప్రసాదానికి కూడా డిమాండ్ పెరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండున్నర నుంచి మూడు లక్షల లడ్డూలను సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే ప్రసాద విక్రయ కేంద్రాలను అప్పటికప్పుడు పెంచేందుకు దేవస్థానం సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఇప్పటికే కనకదుర్గ నగర్ తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, భవాని ఘాట్లలో కూడా ప్రసాద విక్రయ కేంద్రాలు ఉన్నాయని భక్తులు ఆయా కేంద్రాల్లో కూడా కొనుగోలు చేయవచ్చునన్నారు. లడ్డూలు ఎక్కువ కాలం నిలువ ఉండేలా అత్యంత నాణ్యత కలిగిన శనగపిండి, పంచదార, నూనె, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వాడుతున్నట్లుగా గమనించారు. అత్యంత పరిశుభ్ర వాతావరణంలో ఈ లడ్డు ప్రసాదం తయారు అవుతోందని వివరించారు. లడ్డు తయారీ కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాల లడ్డు విక్రయ కేంద్రాలకు రవాణా చేసే సమయంలో రవాణా వాహనాలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను చక్క దిద్దాలని పోలీస్ అధికారులకు సూచించామన్నారు.
అన్న ప్రసాదం విషయంలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. రోజుకు 25 వేల మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. కట్టె పొంగలి, పులిహోర, దద్యోజనం కూడా భక్తులకు అందిస్తున్నట్లు తెలిపారు. అన్న ప్రసాదంపై భక్తులు అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు.
మూలా నక్షత్రం రోజు జగన్మాత సరస్వతి దేవిగా దర్శనం ఇస్తారు. మన పురాణ గ్రంధాల ప్రకారం అలంకారాలలో ఈ అలంకారానికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. సర్వ విద్యలకు అనుష్టాన దేవత అయిన సరస్వతి రూపాన్ని దర్శించేందుకు భక్తులు ప్రాధాన్యత ఇస్తారని, సరస్వతి దేవి రూపంలో ఉన్న జగన్మాతను దర్శించుకుంటే సర్వవిద్యాపారంగతులు అవుతారనే అచంచలమైన విశ్వాసంతో భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే చేశామన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల క్రమబద్దీకరణ, అన్నదానం కేంద్రాలలో ఏర్పాట్లు, మంచినీరు, మజ్జిగ, పసిపిల్లలకు వేడి పాలు వంటి అవసరాలతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో
ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. లడ్డు పోటు, అన్న ప్రసాద తయారీ కేంద్రాల తనిఖీలలో కలెక్టర్ వెంట ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్. రమ, ఏ.ఈ.ఓ. పి. చంద్రశేఖర్,
సూపరింటెండెంట్ వై. హేమదుర్గ, సిబ్బంది కే. సీతారామయ్య, జగన్నాథరావు, ఆదినారాయణ, ఎ.కే.డి. కృష్ణ తదితరులు ఉన్నారు.