
పరవశించే చిత్ర కళ ఇది..!
“ ప్రకృతే…! పరవశించే చిత్ర కళ ఇది ”
“ఉట్టి పడిన ప్రకృతి, జాలు వారిన చిత్ర కళ!”
చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం (పెయింటింగ్) ఒక వైపు అయితే కల్పిత లోకాలలో విహరించేది మరొక వైపు. భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించగలిగే చిత్రలేఖనం, మానవుని అభివృద్ధిలో కీలకమైన కళ.కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ, భావాలను ఆలోచనలను తమ చిత్రలేఖనం ద్వారా వ్యక్త పరుస్తూ ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థుల కళాభిరుచి ఎనలేనిది.ఇటీవల లలిత కళల విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఆర్ట్స్ కామర్స్ లా కళాశాల ప్రచార్యులు ఆచార్య ఎమ్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పలు చిత్ర కళా ప్రదర్శనలు సైతం లలిత కళ ల విభాగం వారుఏర్పాటు చేస్తున్నారు.అంతే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల లో లలిత కళ ల లో విశిష్ట అనుభవం, నిష్ణాతులైన నిపుణులతో ప్రత్యేక ఉపన్యాసాలను సైతం విద్యార్థులకు ప్రత్యేకంగా అందిస్తున్నారు. విఖ్యాత చిత్రకారులైన బండి కోళ్ల జాన్ రత్నబాబు,దృశ్య కళా రంగానికి చెందిన అధ్యాపకులు విభాగ సమన్వయకర్త పులిచెర్ల దేవకాంత్, బద్దె శేఖర్ బాబు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న చిత్ర కళా ప్రదర్శనలు ఎందరినో ఆకర్షిస్తున్నాయి.వర్సిటీ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర రావు, తాత్కాలిక రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం తదితరులు ఈ చిత్ర కళా ప్రదర్శనలను తిలకించుతూ పలు సూచనలు చేస్తూ తమ కళాభిరుచిని తెలియజేశారు. విశాలమైన వర్సిటీ ప్రాంగణాలలో సైతం విద్యార్థులు తమ కళా నైపుణ్యము చూపాలని అందుకు కావాల్సిన వనరులను అందిస్తామన్నారు.
రవి గాంచనిచో కవి గాంచునే అంటారు పెద్దలు., కానీ ” కవి గాంచని చోటును కూడా చిత్రకారుడు గాంచును” అని అనడం మర్చిపోయినట్లున్నారనిపిస్తుంది ఒక్కోసారి. ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము లో కనపడుతున్న కళా చిత్రాలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఎ.ఎన్.యు. ప్రాకారములపై ప్రాంగణములో, వివిధ భవనాల వద్ద, సేద తీరు బల్లలపై సైతం అద్భుత కళా చిత్రాలు అగుపిస్తున్నాయి.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంటేనే ఆసియా ఖండంలో ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయతతో, పచ్చని చెట్ల నడుమ ‘విద్యా కుసుమాలతో” విజ్ఞాన సుగంధాలను పరిమళింపజేసే ఓ ఆదర్శ అధ్యయన విద్యా కేంద్రం. ఆ చెట్ల బెరడులపై కూడా అందమైన చిత్రాలను విద్యార్థులు కళాత్మకంగా గీస్తున్నారు. ప్రకృతి రమణీయతతో శోభిల్లే విశ్వ విద్యాలయం నేడు విద్యార్థుల చిత్రకళా నైపుణ్యంతో మరింత సుందరంగా రూపుదిద్దుకుంటున్నది.
పూర్వం గురుకులాలలో విద్యనభ్యసించిన విద్యార్థుల ప్రతిభా పాఠవాలను,ఆయా రంగాలలో వారు ఎంతటి సృజనాత్మకత,నైపుణ్యాన్ని సాధించారో ప్రదర్శించి చూపేవారని విన్నాం! ఆనాటి స్మృతులను ఈనాటి విశ్వవిద్యాలయ ఆచార్యులు నేటి సమాజానికి జ్ఞప్తికి తెచ్చేలా ఒక మంచి ఆలోచనకు సంకల్పించారు. అందులో భాగంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు,నేటి తరం విద్యార్థులకు విద్యారంగానికి దిక్సూచిలా వినూత్న రీతిలో విశ్వ విద్యాలయములోని ఆర్ట్స్ కళాశాల కు చెందిన ఫైన్ ఆర్ట్స్ విభాగ విద్యార్థులకు వారి నైపుణ్యంను బాహ్య ప్రపంచానికి తెలియజేసేలా పలు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం ఆరుబయట, రూసా భవనాల వద్ద, దూర విద్యా కేంద్రం భవనం వద్ద, విశ్వవిద్యాలయంలో ఏపుగా పెరిగిన చెట్లు, కూర్చునే బల్లలు, భవనాలపై, విశ్వవిద్యాలయ గోడలపై వారి చిత్రకళను కళాత్మక రీతిలో విద్యార్థులు సృజనాత్మకంగా ప్రదర్శింపచేశారు. సహజంగా తరగతి గదులలో, ల్యాబ్ లోని ఆర్ట్ స్టూడియోలో పేపర్, కాన్వాస్ లను జవాబు పత్రాలుగా ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ సిమెంటు బల్లలను, పెద్ద పెద్ద చెట్ల కాండం బెరడులనే జవాబు పత్రాలుగా డ్రాయింగ్, కాంపోజిట్ సబ్జెక్ట్స్ పై పరీక్షలు నిర్వహించడం దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు.
. వీరు గీసిన కళా చిత్రాలను చూసి అందరూ ఆశ్చర్య చకితులై ‘ఔరా!’అంటున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆచార్యులు, బోధన బోధనేతర సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.8 ఈ చిత్రాలతో విశ్వవిద్యాలయం సరికొత్త కళను సంతరించుకుందని చెప్పటంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు. ప్రతీ చిత్రం ప్రకృతి పరవశం ను చూపుతున్నట్లు కనబడుతున్నది. సృష్ఠి కి ప్రతిసృష్ఠి చేయగల అపర బ్రహ్మ చిత్రకారుడు. నిజానికి కుంచె తో చిత్రానికి ప్రాణం పోయడం అంటే ఒకరకంగా తపస్సు చేయడం లాంటిదే!
ఈ చిత్రకారులు వారు దర్శించిన ప్రాకృతిక అందాలకు , ఊహాశక్తిని జోడించి అందమైన చిత్రాలుగా మలుస్తున్నారు. చిత్ర కళాభిమానుల మనసుల్ని గెలుచుకుంటున్నారు.
“ప్రకృతి నే విద్యార్థుల చిత్రాలుగా ఆవిష్కరణ”
““*ప్రకృతే పరవశించే చిత్ర కళ!”
మన ఆధునిక చిత్రకళ 19వ శతాబ్దంలో ఊపిరి పోసుకుంది. ఇక్కడి విద్యార్థులు ‘ఒకే కళా విధానానికి’ మాత్రమే కట్టుబడకుండా వివిధ కళా విధానాలలో కళాకృతులను,చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు.
చెట్ల తొర్రలలోపక్షులు, అడవి జంతువులనుండి ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాల వరకు అన్నింటినీ సహజమైన చిత్రాలుగా మలుస్తున్నారు.
చిత్రకారుడు తన చిత్రాల్ని వస్తుగతంగా బాహ్య గత ప్రతిబింబాలుగా మలుస్తాడు. వీటిలో ఆత్మ గతం, జీవితానికి సంబంధించిన భావాలకు రూపాన్ని ఇవ్వడాన్ని చూడొచ్చు. అంటే ప్రాకృతిక అందాలలో జీవితాన్ని చూసుకోవడమన్నమాట! కొండలు, సెలయేర్లు, చెట్ల వంటి వీరు గీసిన చిత్రాలు “ఎక్స్ప్రెషనిజం” కళా విధానం కిందకు వస్తాయి.
సహజమైన మానవ ప్రకృతి, అసంబద్ధమైన స్వాప్నిక జగత్తులో మనిషి మేధస్సులో అవ్యక్తంగా వచ్చే వింత భావాలకు అద్దం పట్టే
” సర్రియలిజం” కళా విధానంలోనూ కొన్ని చిత్రాలు వీరి కుంచెలోంచి మంచి ఆకృతి దాల్చి వస్తున్నాయి.
రంగులలో ప్రధానమైన రంగులుగా ఉన్న ఎరుపు, పసుపు, నీలం ల శాస్త్రీయమైన కూర్పు వల్ల వర్ణ స్వచ్ఛతను చిత్రాలలో ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమైన “పోయింటలిజం” కళా విధానానికి చెందిన చిత్రాలను కూడా వీరు గీస్తున్నారు. ఇది వర్ణ సంవిధానం తెచ్చిన కొత్తదనం. ఈ విధంగా వర్ణ చిత్రాలకు కొత్త సొబగులద్దుతున్నారు.
పోల్చుకోదగిన ఒకే రూపం గానీ , ఆలోచనలకు, భావాలకు అందని రంగులు, రేఖలు వాటి కూర్పు వల్లనే సాధ్యమయ్యే “ఆబ్ స్ట్రాక్ ఆర్ట్ ” చిత్రకళా విధానంలో కూడా కొన్ని చిత్రాలు దర్శనమిస్తున్నాయి.
కళ లక్ష్యాన్ని గురించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంగ్లో ఐరిష్ కి చెందిన సుప్రసిద్ధ నాటక,నవలా రచయిత,ఆర్ట్ రివ్యూయర్ “ఆస్కార్ వైల్డ్” ఓ సందర్భంలో ఇలా అంటాడు.”రామణీయకాన్ని సృష్ఠిస్తాడు కళా స్రష్ఠ! కళను ఆవిష్కృతం చేయడం కళా స్రష్ఠను అజ్ఞాతంగా ఉంచడం కళ లక్ష్యం!.”
రామణీయకంలో వికృతార్థాలు చూసేవారు భ్రష్టులు, మనోరంజనం చేయలేరు ఇది దోషం! రామణీయకంలో రమణీయ అర్థాలను చూసే వారు సంస్కారులు,వీరికి భవిష్యత్తు ఉంది”. “మానవుడి నైతిక జీవనం కళా స్రష్ఠకు వస్తువు అవుతుంది! లోప భూయిష్టమైన సాధనాన్ని లోపరహితంగా ఉపయోగించడం కళనీతి”..!
ఆస్కార్ వైల్డ్ చెప్పినట్లు కళలో వికృతార్ధాలు చూసేవారు భ్రష్టులు తుచ్చులు. చూసే కళ్లుంటే , అర్థం చేసుకునే మనసుంటే స్పందించగలిగే సంస్కారం ఉంటే ప్రతీచిత్రం ఓ కళా ఖండమే! చిత్రకారుడి ప్రతీ గీత ఆనంద హేతువే!
ఈ విద్యార్థులు చిత్ర కళ లో ఒక విధానానికి గానీ, సిద్ధాంతానికి గానీ లోబడక తమదైన శైలిని కొత్తగా సృష్ఠించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకృతిలోని వర్ణ వైవిధ్యం ఈ చిత్రాలకు ప్రాణంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులైనప్పటికీ వర్ణసంయోగం, వర్ణ సమ్మేళనం ఈ చిత్రాలలో కనబడుతున్నది. ప్రతీ చిత్రానికీ ఓ భావ పూరిత ఆలోచన ఉంటుంది, ప్రతీచిత్రానికీ ఓ ప్రయోజనం ఉంటుంది. కళాకారుడు ప్రకృతిని చూసినప్పుడు పరవశిస్తాడు, ఆ పరవశం కాస్తా చిత్రమవుతుంది! అలాగే అందమైన ఓ వస్తువునో, జంతువునో , మనిషినో చూసినప్పుడు తాను అందాన్ని ఆస్వాదిస్తూ .. పటంపై ‘చిత్రం’గా సాక్షాత్కరిస్తాడు. ఈ విద్యార్థుల చిత్రాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వైవిధ్యంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక చిత్రకారులుగా ఈ “యువ”త ప్రయాణం ఆనందదాయకం కావాలని విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య కె రత్న షీలామణి పలువురు ఆచార్యులు ,వర్సిటీని నిత్యం సందర్శించే విద్యావేత్తలు అంతా శుభాశీస్సులు అందిస్తున్నారు.విద్యార్థులను ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయము లోని ఆర్ట్స్ కామర్స్ లా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎమ్ సురేష్ కుమార్ ప్రశంసించి ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ వినూత్న ఆలోచన చేసిన చిత్ర కళా రంగ అధ్యాపకులు బండి కోళ్లజాన్ రత్నబాబు ని,విభాగ సమన్వయ కర్త పులిచెర్ల దేవకాంత్, శేఖర్ బాబు లను విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, దూరవిద్యాకేంద్ర సంచాలకులు ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు,వర్సిటీ బోధన బోధనేతర సిబ్బంది అభినందిస్తున్నారు!
రచయిత: త్రివిక్రమ్ సుఖవాసి
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం