
పాతబస్తీలో ట్రాఫిక్ నియంత్రణకు కసరత్తు
న్యూస్ వెలుగు, కర్నూలు; నగరంలోని పాతబస్తీలో ట్రాఫిక్ నియంత్రణకు కసరత్తు చేస్తున్నామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. మంగళవారం ట్రాఫిక్ పోలీసులు, నగరపాలక అధికారులతో కలిసి కమిషనర్ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పాతబస్తీలో ఇరుకైన రహదారులు, అధిక జనసంచారం, రహదారులపై వాహనాల పార్కింగ్ వంటి సమస్యల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పెద్ద మార్కెట్ వద్ద విభాగిని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వెనుక భాగంలో ఉన్న పార్కును, కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న మురుగు కాలువను కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్, ఆరోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి ఎస్ఈ రాజశేఖర్, ఎంఈలు సత్యనారాయణ, శేషసాయి, డిఈఈ గంగాధర్, శానిటేషన్ ఇంస్పెక్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.