ఆంధ్రప్రదేశ్‌లో విషాదం.. ఉల్లిగడ్డ బాంబు పేలి ఒకరి మృతి..!
ఏలూరు; దీపావళి సందర్భంగా అందరూ సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించి పటాకులు కాలుస్తాం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తి దీపావళి పటాకులు విక్రయించడానికి ‘ఉల్లిగడ్డ’ బాంబులతో మోటారు సైకిల్ పై వెళుతుండగా ఒక దేవాలయం వద్ద గుంతలో పడినప్పుడు ఆ ఉల్లిగడ్డ బాంబులు పేలిపోయాయి. దీంతో ఆ వ్యక్తి మరణించగా, మరో ఐదారుగురు గాయ పడ్డారు. ఈ ఉల్లిగడ్డ బాంబుల్లో ఐఈడీ వంటి పేలుడు పదార్థాలు వాడి ఉంటారని అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12.17 గంటలకు జరిగినట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపుతోంది. గాయ పడిన ఆరుగురు వ్యక్తులు జిల్లా కేంద్ర దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతం అంతా పొగ కమ్మేసింది. పేలుడుతో పరిసర ప్రాంతాలు భయానకంగా మారాయి.స్కూటర్ మీద ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళ్తున్న వ్యక్తిని సుధాకర్ అని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.