గిరిజన ఉప ప్రణాళిక నిధులను వినియోగించండి
గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ వెలుగు: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లోని గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గిరిజన అభివృద్ధి ఉప ప్రణాళిక పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో 14 మండలాల్లోని 48 చెంచుగూడెంలలో నివాసం ఉంటున్న దాదాపు 53,000 మంది జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో మనసు పెట్టి కృషి చేయాలన్నారు. గిరిజన ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులు, సంబంధిత పనుల ప్రగతి నివేదికలను కలెక్టర్ పరిశీలిస్తూ సంబంధిత అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గిరిజన ఉప ప్రణాళిక క్రింద సూచించిన ప్రొఫార్మాలో పధకాల వారీగా లక్ష్యాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఆత్మకూరు, నందికొట్కూరు, కొత్తపల్లి, ప్యాపిలి మండలాల్లో అత్యధికంగా గిరిజన తెగలకు సంబంధించిన జనాభా ఉన్నారన్నారు.
పీఎం జన్మన్ కింద పక్కా ఇండ్లు, రోడ్ల అనుసంధానం, త్రాగునీటి సరఫరా, మొబైల్ మెడికల్ యూనిట్స్, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యుత్ కనెక్షన్లు, మొబైల్ టవర్స్, ఆధార్ సీడింగ్, జన్ ధన్ అకౌంట్ తదితర 11 అత్యవసర సదుపాయ కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెంచుగూడాల్లో 2063 పక్కా గృహాలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. పీఎం జన్మన్ కింద మంజూరైన 527 గృహాలకు గాను 11 మాత్రమే ప్రగతిలో ఉన్నాయని మిగిలిన వాటిని నిర్మించేందుకు లబ్ధిదారులను మోటివేట్ చేయడంతో పాటు గృహాలు నిర్మించి ఇచ్చే సంస్థలను గుర్తించాలని కలెక్టర్ హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్యను ఆదేశించారు. పాణ్యంలో 167, కొత్తపల్లిలో 171, శ్రీశైలంలో 122 ఇళ్లు అత్యధికంగా నిర్మించాల్సి ఉందని… అధికారుల బృందమంతా ఆయా ప్రాంతాలకు వెళ్లి గృహాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో ప్రగతి చూపకపోతే నిధులు మంజూరు కావని కలెక్టర్ గుర్తు చేశారు.
పెచ్చెరువు, జానాల గూడెం, చింతలకుంట తదితర గూడాలకు రోడ్డు కనెక్టివిటీకి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులను సూచించారు. ఆరు గిరిజన ప్రాంతాల్లో వైద్య ఉపకేంద్రాలు లేవని మొబైల్ యూనిట్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వో ని ఆదేశించారు. ఆత్మకూరు, వెలుగోడు ప్రాంతాలలో రెండు సంక్షేమ హాస్టల్ భవన నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలన్నారు. జానాల గూడెంలో నివసిస్తున్న 50 చెంచు కుటుంబాలకు విద్యుత్ సదుపాయం కల్పించాలని ఏపీఎస్పీడీసీఎల్ ఇంజనీర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో 517 మందికి ఆధార్, 354 మందికి రేషన్ కార్డులు, 500 మందికి ఉపాధి జాబ్ కార్డులు, 734 మందికి ఎన్టీఆర్ వైద్య సేవా కార్డులు, 813 మందికి కుల ధ్రువీకరణ పత్రాలు, 1917 మందికి బీమా ప్రీమియం, 517 మందికి పెన్షన్ తో పాటు పిఎం కిసాన్, సీసీఆర్సీ కార్డ్స్ లేవని సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే సమావేశానికి సూచించిన అంశాల్లో ప్రగతి కనపడాలన్నారు. జిల్లాలో చెంచుగూడాలలో వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలు 33 శాతం ఉన్నారని పిల్లల ఎదుగుదలకు అంగన్వాడి కేంద్రాలు కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో ఐటీడీఏ పిఓ శివ ప్రసాద్, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, లీడ్ డిస్టిక్ మేనేజర్ రవీంద్ర కుమార్, సిపిఓ వేణుగోపాల్ సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.