14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’

14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’

గ్రామ సభల్లో తీర్మానించిన 30వేల పనులకు శ్రీకారం
రూ.4500 కోట్లు ఉపాధి హామీ నిధులు వ్యయం
3 వేల కిమీ సీసీ రోడ్లు, 500 కిమీ తారు రోడ్లు లాంటి పనులు మొదలు
పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి
జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్

అమరావతి, న్యూస్ వెలుగు;  గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలి. ప్రతి పంచాయతీకి నిధుల సమస్య లేకుండా చూస్తున్నాము. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు మొదలుపెట్టాలి’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో విప్లవాత్మక రీతిలో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులు పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలి అన్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, ముఖ్యకార్య నిర్వహణ అధికారులు, డిపిఓ లు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఫీల్డ్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, జిల్లా నీటి సరఫరా విభాగం అధికారులకి దిశానిర్దేశం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గ్రామ సభలకు కొనసాగింపుగా పల్లె పండుగ చేపడుతున్నాము. వారం రోజులపాటు నిర్వహిస్తున్నాము. గ్రామసభల్లో తీసుకున్న అర్జీలు పరిష్కారానికి, తీర్మానాలను అమలుచేసేందుకు, దాదాపు 4500 కోట్ల వ్యయంతో, 30 వేల పనులను మొదలుపెట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించాము. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు లాంటి పనులు చేపట్టాలి” అన్నారు. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. డైరెక్టర్ శ్రీ షణ్ముఖ్, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS