హైదరాబాద్‌ నుంచే ‘విశాఖ హనీట్రాప్‌’

హైదరాబాద్‌ నుంచే ‘విశాఖ హనీట్రాప్‌’

గ్యాంగ్‌ సభ్యులుగా సుమారు 15 మంది?
3 బ్యాంక్‌ అకౌంట్లు హైదరాబాద్‌ నుంచే నిర్వహణ

హైదరాబాద్‌, న్యూస్ వెలుగు: అందమే వాళ్ల పెట్టుబడి. డబ్బున్న మగాళ్లే వారి టార్గెట్‌. హసీ వాయిస్‌తో మాటాల్లోకి దించుతారు. పరిచయాలు, చాటింగ్స్‌, డేటింగ్స్‌, వీడియోకాల్స్‌తో మెల్లగా రంగంలోకి దించుతారు. ప్రేమ, పెళ్లి అంటూ నమ్మిస్తారు. ఆ తర్వాత అందినకాడికి దోచేస్తారు. విశాఖలో వెలుగుచూసిన ‘హనీట్రాప్‌’ అలాగే జరిగింది. ఈ ట్రాప్‌లో కీలక సూత్రధారి అయిన జమీమా అండ్‌ కో.. మొదట ఓనమాలు దిద్దింది హైదరాబాద్‌లోనే. ఇక్కడ పదుల సంఖ్యలో డబ్బున్న వారిని వంచించిన తర్వాతే వైజాగ్‌కు షిఫ్ట్‌ అయినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో మోసపోయిన వారిలో ఎక్కువగా ధనవంతులు, పెండ్లయినవారే ఉండటంతో ఏ ఒక్కరూ ఫిర్యాదులు చేయలేదని సమాచారం. దీనిని వెలుగులోకి తెచ్చిన విశాఖపట్నం సీపీ బాగ్చీ సైతం హైదరాబాద్‌ బాధితులు తమకు వివరాలు చెప్పాలని కోరారు.

మూడు బ్యాంక్‌ అకౌంట్లు..
విదేశాల్లో స్థిరపడ్డ, బాగా సంపాదించిన మగవాళ్లను లక్ష్యంగా చేసుకొని మోసాలు చేస్తున్న ఈ గ్యాంగ్‌లో మొత్తం 15 మంది వరకు సభ్యులు ఉన్నట్టు సమాచారం. వీరు నిర్వహిస్తున్న బ్యాంకు అకౌంట్లు హైదరాబాద్‌లో ఓపెన్‌ చేసినవే కావడటంతో ఇక్కడ కూడా వారి మూలాల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఎన్నారైలకు అందమైన ఫొటోలు షేర్‌ చేసి ఆకర్షించడం, ప్రేమపెళ్లి పేరుతో లైన్‌లో పెట్టడం వీరి దినచర్య. ఎవరైతే వీరి వీడియోలకు లైక్‌లు, కామెంట్లు చేస్తారో వారి అకౌంట్లు, హోదా, అంతస్తు తదితర విషయాలను గమనించి వారిని లైన్‌లో పెడుతారు. రొమాంటిక్‌ వీడియోకాల్స్‌ చేసి స్వీట్‌గా మాట్లాడుతూ.. ఆ తర్వాత మెల్లిగా పెండ్లి ప్రపోజల్‌ తీసుకొస్తారు. ‘అమ్మానాన్నలతో మాట్లాడిన తర్వాతే ఏదైనా’.. అంటూ నమ్మిస్తారు. ఆ తర్వాత ఓ ఇంటి అడ్రస్‌ ఇస్తారు. అప్పటికే ఓ సినిమా ైస్టెల్‌లో నకిలీ పేరెంట్స్‌ను రంగంలోకి దించుతారు. అంతా ఓకే అనుకున్న తర్వాత.. వాళ్లే ఓ ప్లేస్‌ చెప్పి అక్కడికి రమ్మంటారు. రొమాన్స్‌ పేరుతో మత్తుమందు కలిపిన మందు తాపించి, డ్యాన్స్‌లు చేయించి సోయితప్పేలా చేస్తారు. ఆ తర్వాత వారిని నగ్నంగా మార్చి ఫొటోలు, వీడియోలు తీసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఫొటోలు సోషల్‌మీడియాలో పెడతామని బెదిరిస్తారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!