అభివృద్ధికి బాటలు వేస్తున్నాం
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల, న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వం వందరోజుల పాలన దిగ్విజయంగా ముగించుకుని అభివృద్ధికి బాటలు వేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని రెండవ వార్డు చింతరగు వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పట్టణాలు, గ్రామీణ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసి అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. వందరోజుల పాలన దిగ్విజయంగా ముగించుకుని అభివృద్ధివైపు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పనులను మాత్రమే ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రజలలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. ఈ మేరకు అన్ని పట్టణాలు, గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం – ప్రజావేదిక కార్యక్రమాలు వారం రోజులు పాటు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. అధికారంలోకి రాగానే పింఛన్ సొమ్ము రూ.మూడు నుంచి రూ.నాలుగు వేలకు పెంచడం, దివ్యాంగులకైతే రెండింతలు చేసి రూ.6,000లు ఇవ్వడం శుభ పరిణామన్నారు. భూములకు భద్రతలేక, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. వంద రోజుల్లోనే 16,437 డిఎస్సి పోస్టుల విడుదల చేశామన్నారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం ఐదు రూపాయలకే టిఫిను, భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, ప్రజలకు ఉపయోగపడే పనులనే ప్రభుత్వం చేపడుతుందని మంత్రి తెలిపారు. పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని చెప్పారు. వరద విపత్తు సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోజులు బస్సులోనే ఉండి ప్రజలకు సహాయక చర్యలు అందేలా చూశారన్నారు. విపత్తు ప్రభావాన్ని తగ్గిస్తూ సహాయక చర్యలు అందించడంలో కృతార్థులయ్యారన్నారు. గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద రహదారులు, మురికి కాల్వలు నిర్మిస్తామన్నారు. అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలని, రాజీ పడొద్దని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజులలో ప్రజలకు సుపరిపాలన అందిస్తుందన్నారు. సంకల్పం, చిత్తశుద్ధితో అతి తక్కువ కాలంలోనే అనేక విజయాలు సాధిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. భారీ వర్షాలు, గోదావరి, కృష్ణా నది వరదలతో గ్రామాలలో వందల ఇళ్ళు జలదిగ్బంధంలో చిక్కుకుంటే సీఎం పది రోజులు బస్సులోనే ఉండి యంత్రాంగానికి స్ఫూర్తినిచ్చారన్నారు. ప్రకృతి విపత్తు ప్రభావాన్ని తగ్గించి యంత్రాంగం సమర్థంగా పని చేసిందని వివరించారు. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పరిపాలనలో నిమగ్నమయిందని చెప్పారు. ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. అంతకుముందు మంత్రి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వినతి పత్రాల ద్వారా కొందరు తమ సమస్యలను విన్నవించగా, మరి కొందరు మా ఇబ్బందులను తొలగించాలని అభ్యర్థించడంతో తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున , రెండో వార్డు టిడిపి ఇన్చార్జ్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.