విశాఖ ఉక్కుకి అండగా ఉంటాం
విశాఖపట్నం, న్యూస్ వెలుగు; విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుందామంటూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన కూటమి ప్రజా ప్రతినిధులు తీర్మానించారు. కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. బుధవారం సాయంత్రం రుషికొండలోని రాడిసిన్ బ్లూ హోటల్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన కూటమి ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపైనే చర్చ జరిగింది. అందరూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరచారు. ప్రస్తుతం కర్మాగారంలో ఒక్కొక్క యూనిట్‌ను మూసివేస్తున్నారని, ఉద్యోగులను డిప్యుటేషన్‌పై బయటకు పంపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కేంద్రంతో చర్చించాలని కోరారు.
ఇప్పుడున్న సంక్షోభం నుంచి బయటపడి కర్మాగారం సజావుగా నడవాలంటే ఉక్కు దిగ్గజం సెయిల్‌లో విలీనం చేయడం ఒక్కటే మార్గమని కొందరు అభిప్రాయపడ్డారు. 32 మంది బలిదానంతో ఏర్పడిన కర్మాగారం ఆంధ్రుల సెంటిమెంట్‌కు సంబంధించిందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్టీల్‌ప్లాంటును కాపాడుకోవాలని ఉద్దేశంతో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ విశాఖపై తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. పాదయాత్ర సమయంలో ఉక్కు కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చానని గుర్తుచేశారు.
విశాఖ ఉక్కుతో ప్రతి తెలుగువాడికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, హైదరాబాద్‌లో తమ ఇంటికి విశాఖ ఉక్కు స్టీల్ వాడామన్నారు. కర్మాగారాన్ని వెంటాడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి కార్మికుల కళ్లల్లో ఆనందం చూడాలనే దృఢ సంకల్పంతో కేంద్రంతో సంప్రతింపులు జరుపుతున్నామని అన్నారు. అందరికీ ఆమోద్యమైన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను చంద్రబాబునాయుడుకు నివేదిస్తామన్నారు. కేంద్రంతో సీఎం చర్చించి ఉక్కు కర్మాగారంపై ఒక నిర్ణయం తీసుకుంటారని లోకేశ్ వెల్లడించారు.