రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

పత్తికొండ, న్యూస్ వెలుగు :చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల బతుకులు ఛిద్రమయ్యాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  తీవ్రంగా విమర్శించారు. గురువారం  ఉదయం రైతులు మరియు క్రిష్ణగిరి ఎంపీపీ వెంకటరామిరెడ్డి గారితో కలిసి హంద్రీనీవా కాలువ

వెంట పర్యటించిన ఆమె, పంటలను కాపాడుకునేందుకు రైతులు హంద్రీనీవా కాలువ నీటిని వినియోగించుకుంటే వారి విద్యుత్ మోటార్ల వైర్లు తొలగించడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని, సరైన వర్షాలు లేక సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సింది పోయి, కాలువ నీటిని వినియోగించుకుంటున్న రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. హంద్రీనీవా కాలువ కోసం భూములు ఇచ్చిన రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు, తమ పంటలను కాపాడుకునేందుకు కాలువ నీటిని వినియోగించుకునే హక్కు కూడా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించి, పంటలు ఎండిపోకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 169 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు కాలువ నీటిని ఉపయోగించుకుంటే విద్యుత్ మోటార్ల వైర్లు కత్తిరించడం ఏ న్యాయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసగించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గతంలో రుణమాఫీ పేరుతో హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా మరోసారి రైతులను వంచిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, తక్షణ పరిష్కారం కోసం అధికారులను కోరుతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్నలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి గారు మాట్లాడుతూ, చంద్రబాబు కాలు పెడితే కరువు తప్ప మరేమీ ఉండదని విమర్శించారు. ప్రజలను మాత్రమే కాకుండా రైతులను కూడా వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఎవ్వరూ సాటి రారని అన్నారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో రాజకీయాలు చేయకుండా వెంటనే సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు,మండల కన్వీనర్, జిల్లా సెక్రెటరీ మండల ఉపాధ్యక్షులు, జిల్లా కమిటీ నాయకులు, మండల అనుబంధ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS