గోడ పత్రికను విడుదల చేసిన కలెక్టర్
Puttaparthi (పుట్టపర్తి ) : హెచ్ఐవి , లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల గురించి సమాచారాన్ని అందించేందుకు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రెండు నెలలపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నేతృత్వంలో మీకు తెలుసా రాష్ట్రస్థాయి ఇంటెన్సిఫైడ్ ఐఇసి క్యాంపెయిన్ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ టీఎస్.చేతన్ ప్రారంభించారు.
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందని వారు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా సోమవారం గోడ పత్రికలు విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జనాభాలో హెచ్ ఐవి మరియు సుఖ వ్యాధులు(ఎస్టీఐ) ల గురించి పరిజ్ఞానం, అవగాహన పెంపొందించండానికీ, సురక్షిత పద్ధతులు పాటించడానికి, హెచ్ ఐవి ఉన్నవారి పట్ల వివక్ష తగ్గించేందుకు, ప్రజల్లో అవగాహన కలిగించి తద్వారా ఎక్కువ మంది హెచ్ ఐవి పరీక్షలు చేసుకునేందుకు ముందుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల కనుగుణంగా జిల్లాలో అవగాహనా కార్యక్రమాల్ని చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఇంటెన్సిఫయిడ్ ప్రచార కార్యక్రమాన్ని మీకు తెలుసా అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో హెచ్ఐవి తో జీవిస్తున్న వారి సంఖ్యలో భారతదేశం రెండో స్థానంలో ఉన్నదన్నారు . దేశంలో హెచ్ ఐవి ప్రాబల్యం తక్కువగా ఉన్నప్పటికీ, 2023 నాటికి సుమారు 25.44 లక్షల మంది హెచ్ ఐవితో జీవిస్తున్నారు. 2022-23 సంవత్సరంలో 68,450 క్రొత్తగా హెచ్ఐవి కి గురికావడము జరిగింది. జిల్లాల వారీగా క్రొత్తగా హెచ్ ఐవి బాధితుల పెరుగుదల చూస్తే 2007లో 156 గా బాధితుల సంఖ్య 2022 నాటికి 178కి పెరిగింది. మన రాష్ట్రంలో 2014-15 సంవత్సరములో 25,649 మంది క్రొత్తగా ఎఆర్ టి మందుల కోసం నమోదు చేసుకోగా 2023-24 లో కేవలం 14,257 మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. 2024జులై నాటికి 2,22,425 మంది ఎఆర్టి మందులు వాడుతుంటే, వారిలో 10,104 మంది 15 నుండి 25 ఏళ్ల వయస్సు వారున్నారు. ఆర్ట్ మందులు వాడేవారిలో హెచ్ఐవి వైరస్ 96 శాతం మందిలో అదుపులో ఉంది. అంటే వీరిలో వైరస్ ఒకరినుండి ఒకరికి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అయినప్పటికీ, 2004 నుండి ఇప్పటివరకు 1,48,270 మంది ఎయిడ్స్ బారిన పడి మరణించడం గమనార్హం. అందుకే అనుమానం ఉన్నవారంతా సిగ్గు పడకుండా తప్పనిసరిగా రక్త పరీక్ష చేయించుకుని, ఒక వేళ హెచ్ఐవి పాజిటివ్ అని బయటపడితే ఎఆర్టి సెంటర్లలో పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా ఉచితంగా మందులు తీసుకుని ఈ వైరస్ నుండి పూర్తిగా కోలుకుని ప్రాణాల మీదకు రాకుండా కాపాడుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు.గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ఎయిడ్స్ ఎలా సోకుతుంది, ఎలా నివారించ వచ్చు, వ్యాధి సోకినా వారి పట్ల ప్రేమతో కలసి మెలసి ఎలా జీవించాలనే విషయాల్ని తెలియ చేస్తారు. గ్రామాధికారులు, విద్యార్థులు ఆరోగ్య కార్యకర్తలు ఈ సభల్లో పాల్గొంటారు. కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు.సామాజిక మాధ్యమాలద్వారా వీడియోలు, మీమ్స్, వంటి వాటి ద్వారా అవగాహన కల్పిస్తారు. పట్టణాలలోని అతి జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటి-ఇంటి ప్రచారం చేస్తారు. గ్రూఫు మీటింగులు పెట్టి ఎయిడ్స్ గురించి చర్చిస్తారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో మాట్లాడించి వారు ఎలా ఆరోగ్యాంగా జీవిస్తున్నారో తెలియ చేస్తారు. హెచ్ ఐవి బాధితుల పట్ల వివక్ష కనబర్చకుండా వ్యవహరిస్తే వారు కృంగిపోకుండా సంతోషంగా బతకవచ్చనే విషయాన్ని తెలియజేస్తారు. రెడ్ రిబ్బను క్లబ్బుల ద్వారా విద్యార్థులు వారి స్నేహితులకు అవగాహనా కార్యక్రమాలు చేపడతారు. వారి మిత్రులలో, ఎవరైనా నడవడిక వేరుగా ఉంటే వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ జరిగేలా చూస్తారు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ (ప్రివెన్షన్ మరియు కంట్రోల్) యాక్టు -2017 సక్రమంగా అమలయ్యేలా వారికి అవగాహన కల్పిస్తారు. సంబంధిత ఇతర శాఖల ప్రతినిధులతో ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సంస్థలలో ఎయిడ్స్ గురించి ప్రణాళికాబద్ధంగా అవగాహన కల్పించే విధంగా తర్ఫీదునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ,ఇన్చార్జి డిఏంహెచ్ఓ డాక్టర్ సెల్వియ సాల్మన్, డిసిహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డిఎల్ఏటీఓ డాక్టర్ తిప్పయ్య, హెచ్ఐవి జిల్లా కోఆర్డినేటర్ జీవి.రమణ , జేజే ఆంజనేయులు, సిఎఫ్ ఐ వెంకట్, ఆర్డీఓ భాగ్యరేఖ,తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.