
తల్లిదండ్రులే నాకు మూలగురువులు : హోంమంత్రి వంగలపూడి అనిత
న్యూస్ వెలుగు అమరావతి: హోంమంత్రి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసక్తికర విషయాలను ఆమె సోషల్ మీడియాతో పంచుకున్నారు. మనకు తొలి ఉపాధ్యాయులు ఎవరు అంటే,మన తల్లిదండ్రులే,తల్లిదండ్రులు మనకు కేవలం జన్మనిచ్చేవారు మాత్రమే కాదు,
మనకు మొదటి అక్షరం నేర్పిన గురువు లని తెలిపారు. తల్లి మనకు ప్రేమతో ఓర్పు నేర్పుతుందని, తండ్రి క్రమశిక్షణ, ధైర్యం, కృషి విలువలు భోదిస్తాడని తెలిపారు.
వీరిద్దరూ కలిసి మనకు జీవిత పాఠశాలలో మూలగురువులుగా నిలుస్తారన్నారు. ప్రతి మలుపులో వెన్నుతట్టి ప్రోత్సహించిన వారు. నాతోపాటు వేలాది మంది విద్యార్థులను ఉన్నత విలువలతో ఎదిగేలా చేసిన మహనీయులు నా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కావడం నా అదృష్టమన్నారు. తరగతి గదిలో పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పి ఈ స్థాయికి చేరేందుకు ప్రోత్సాహాన్ని అందించారన్నారు. తండ్రి రిటైర్డ్ అయినా.. అమ్మ మాత్రం ఇంకా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సబ్బవరంలో నా తల్లిదండ్రులను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, వారి ఆశీర్వాదం నాకు మరింత శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు.