
10 లక్షల పరిహారం చెల్లించండి సీఎం
Amaravathi News Velugu: ప్రభుత్వ సేవలను సులభతరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులు పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై నేడు సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో చక్కగా పని చేస్తూ ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహిస్తామని అన్నారు. బాగా పని చేస్తున్న ఉద్యోగులకు అప్రిసియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా, వారి వ్యక్తిగత రికార్డుల్లో కూడా వీటిని నమోదు చేయాలని ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీ పాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆసుపత్రిలో చేరిన వారి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలోని వరలక్ష్మీ మిల్క్ డెయిరీ 106 కుటుంబాలకు రోజూ పాల సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ నుంచి వచ్చిన పాలను తాగి అనారోగ్యం పాలయ్యారని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు 70 ఏళ్లకు పైబడిన వారు కాగా ఒకరు 58 ఏళ్ల వయసు వారు ఉన్నారు. బాధితుల నుంచి నమూనాలను తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్‌కు పరీక్షల కోసం పంపించారు. డెయిరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

