
ఏజెన్సీలకు లైసెన్స్ తప్పనిసరి కమిషనర్
కర్నూలు న్యూస్ వెలుగు: నగరంలోని కూడళ్ళు, రహదారులు, గోడలు ఇతరత్రా ప్రదేశాల్లో అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, డిజిటల్ హోర్డింగులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక కార్యాలయంలో ప్రకటన ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఇటివల ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన 253వ జీవో మార్గదర్శకాలను కమిషనర్ వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణ, సుందరీకరణనల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. ఇకపై సాధారణ, డిజిటల్ హోర్డింగుల ఏర్పాటు చేసే వ్యక్తులు, సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏడాది పాటు తాత్కాలిక లైసెన్స్ కోసం రూ.20 వేలు, శాశ్వత లైసెన్స్‌కు రూ.60 వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాత్కాలిక లైసెన్స్ కలిగిన సంస్థలు/వ్యక్తులు 10 హోర్డింగులు, శాశ్వత లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు/సంస్థలు అపరిమిత హోర్డింగులు ఏర్పాటు చేసుకోవచ్చని, లైసెన్స్ ప్రక్రియ తర్వాత ప్రతి హోర్డింగ్‌కి ప్రతి ఏటా ప్రత్యేక ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ గోడలపై పెయింటింగ్‌ను అనుమతితో పాటు కార్పొరేషన్ ఇచ్చే మార్గదర్శకాలకు లోబడి వేయాలని పేర్కొన్నారు.
నగర సుందరీకరణ, పర్యావరణాన్ని దృష్టిలో ఎక్కడబడితే అక్కడ బ్యానర్లు, పోస్టర్లు అతికిస్తే రూ.30 వేల వరకు జరిమానాతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రింటింగ్ సంస్థలు అనుమతి కలిగిన సంస్థలు, వ్యక్తులకే బ్యానర్లు ప్రింట్ ఇస్తారని తెలిపారు. ప్రకటన ఏజెన్సీలు చర్యలు తీసుకునేంత వరకు వేచి ఉండకుండా వెంటనే బకాయిలను చెల్లించాలని సూచించారు.కార్యక్రమంలో డిసిపి వెంకటరమణ, ఎస్ఐ తిమ్మయ్య, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, బిల్డింగ్ ఇంస్పెక్టర్ దివాకర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.


