అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట

అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట

దసరా ఉత్సవాల విజయవంతానికి మీడియా సహకారం అవసరం

 అధికారులు, మీడియా స‌మ‌న్వ‌యంతో భక్తులకు మెరుగైన సేవలు అందిద్దాం

 జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు.

విజయవాడ, న్యూస్ వెలుగు; దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలందించి త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించి ఉత్సవాలు విజయవంతం చేయడంలో మీడియా సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు అన్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల‌ను విజయవంతం చేసేందుకు మీడియా ప్రతినిధుల సలహాలు సూచనలు స్వీకరించేందుకు ఆదివారం క‌లెక్ట‌ర్ సృజ‌న‌, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర‌బాబు.. డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ గౌత‌మిశాలి, శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం ఈవో కేఎస్ రామ‌రావు త‌దిత‌రుల‌తో క‌లిసి పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పోలీస్, దేవాదాయ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో మీడియా ప్రతినిధుల స‌ల‌హాలు, సూచనలు అవ‌స‌ర‌మ‌న్నారు. వీటిని పరిగణన‌లోకి తీసుకొని ఈ ఏడాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్ప‌టికే దసరా ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దసరా ఉత్సవాల నిర్వహణపై పలు సూచనలు సలహాలు అందజేశారు. మీడియా ప్రతినిధుల సూచనలపై జిల్లా క‌లెక్ట‌ర్ స్పందిస్తూ సామాన్య భక్తులకు సంతృప్తికరంగా ఉండేలా అమ్మవారి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని క్యూలైన్లు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు నిరంతరం తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు క్యూలైన్ల‌లో వేచి ఉండే భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిపించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి 27 ప్రాంతాలలో తాగునీటి బాటిల్స్ సరఫరా చేసేందుకు మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్థం లగేజీ, చెప్పులు భద్రపరుచుకునేందుకు 30 క్లాక్ రూములను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీ, వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి వారికి దర్శనం కల్పించి సామాన్య భక్తులకు ఇబ్బంది కల‌గకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై ఎప్పటికప్పుడు భక్తులకు సమాచారాన్ని అందించడంలో మీడియా పాత్ర కీలకమన్నారు. మీడియా ప్రతినిధులకు అవసరమైన ప్రత్యేక డ్యూటీ పాసులను జారీ జారీచేయనున్నామని తెలిపారు. ఎప్పటిలాగే కొండపైన రాజగోపురం సమీపంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసి, మీడియా ప్రతినిధుల కోసం కంప్యూటర్లు, ఇంటర్నెట్ వైఫై వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్ర‌తినిధుల‌కు ఎదురయ్యే ఇబ్బందులను సత్వరం పరిష్కరించేలా పోలీస్, దేవాదాయ శాఖ అధికారుల సమన్వయానికి సమాచార శాఖ అధికారులను లైజనింగ్ అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఉద‌యం 7 గం. నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు ఇలా.. మూడు షిఫ్టు్ల్లో స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండేలా ప్ర‌తిపాద‌న‌లు రూపొందించామ‌న్నారు.

లోటుపాట్ల‌ను స‌రిచేసుకుంటూ ముందుకెళ్తాం: సీపీ రాజ‌శేఖ‌ర‌బాబు
నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర‌బాబు మాట్లాడుతూ గతేడాఇ ప్రింట్ మీడియాలో ప్రచురితమైన కథనాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గత ఉత్సవాలలో ఎక్కడైతే లోటుపాట్లు జరుగుతున్నాయి అనేది మీడియా ప్రతినిధులు కథనాల ద్వారా తెలియచేశారో అటువంటివి పునరావృతం కాకుండా చూసేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామన్నారు. గ‌తేడాది కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య అధికంగా ఉండవచ్చునన్న అంచ‌నాల నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా వాస్తవ సమాచారాన్ని భక్తులకు అందించి దసరా ఉత్సవాల విజయవంతంలో సహకరించాలని మీడియా ప్రతినిధులకు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అన‌వ‌స‌ర గంద‌ర‌గోళం త‌లెత్త‌కుండా ఉండేందుకు ఈ ఏడాది యూనిఫామ్ తో పోలీస్ అధికారులు, సిబ్బంది అమ్మవారి దర్శనానికి అనుమతించడం లేదని ఆయన తెలిపారు. మూలా నక్షత్రం రోజున మీడియా ప్రతినిధులకు ఇబ్బంది కలగకుండా మీడియా ప్రతినిధుల ద్విచక్ర వాహనాలను మోడల్ గెస్ట్ హౌస్ వరకు అనుమతించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు రాజీవ్ గాంధీ పార్క్, భవానీపురం ఫ్లై ఓవర్ వద్ద విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, పోలీస్, దేవాదాయ శాఖ అధికారులు సిబ్బంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి దసరా ఉత్సవాలను విజయవంతం చేసి రానున్న ఏడాదికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలా కృషిచేద్దామని ఆయన కోరారు.
స‌మావేశంలో డీసీపీలు ఏబీటీఎస్ ఉద‌య‌రాణి, ఎం.కృష్ణ‌మూర్తి నాయుడు, అడిష‌న‌ల్ డీసీపీ జి.రామ‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!