హరిహర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
న్యూస్ వెలుగు, కర్నూలు; స్థానిక సంకల్‌భాగ్ నందు ఉన్న హరిహర క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆయన హరిహర క్షేత్రంలో బుధవారం ఆవిష్కరించారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ హరిహర క్షేత్రాన్ని 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణుల సహకారంతో నిర్మించామని, అప్పటినుండి ఎంతో నియమ నిష్ఠలతో, పద్ధతుల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే గత 19 సంవత్సరాలుగా శ్రీవారికి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్టు టీజీ వెంకటేష్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభ ధ్వజారోహణ రోజు, అలాగే చివరి రోజైనా చక్రస్నానం జరిగే రోజు గరుడ పక్షి వచ్చి ఆలయం పైన ప్రదక్షిణ చేసి వెళుతుందన్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరు చూసి తరించాల్సిన విషయం అన్నారు. పది రోజులపాటు ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో కర్నూల్ నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల కూడా పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని టీజీ వెంకటేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నాయకులు దుర్గాప్రసాద్, ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.