రాయలసీమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను ఆపండి 

రాయలసీమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను ఆపండి 

వట్టి మాటలు కట్టిపెట్టి రాయలసీమ సమగ్రాభివృద్దిపై కార్యాచరణ చేపట్టండి

నంద్యాల, న్యూస్ వెలుగు;  రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవం” ను సోమవారం నాడు రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయం, నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. లాయర్ క్రిష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రాబ్యాంక్ విశ్రాంత ఎజియమ్ శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. నిజాం నవాబు ఆంగ్లేయులకు వదిలివేసిన ప్రాంతాన్ని సీడెడ్ జిల్లాలుగా (వదలివేయబడిన / దత్త మండలాలు) పరిగణించిన విషయాన్ని గుర్తు చేసారు. సీడెడ్ అన్న పేరుతో ఒక ప్రాంత ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి పిలవడం ఏ మాత్రం సబబు కాదని చిలుకూరి నారాయణరావు, రాయలసీమ నాయకులు భావించడాన్ని గుర్తుచేసారు. ఆంధ్ర మహాసభలలో భాగంగా నవంబర్ 18, 1928 న నంద్యాలలో జరిగిన దత్తమండల సమావేశలో “రాయలసీమ” నామకరణం జరిన తీరును వివరించారు.దాస్య భావనికి సాంకేతికంగా ఉన్న జిల్లాలకు ఆత్మగౌరవ సూచికగా “రాయలసీమ నామకరణం” జరిగి నేటికి 96 సంవత్సరాలైనా, రాయలసీమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రభుత్వ చర్యలు నేటికి కొనసాగుతుండటాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.‌రాయలసీమలో ఏర్పాటుచేసిన కార్యాలయాల తరలింపును తక్షణమే ఆపాలని, రాయలసీమలో హైకోర్టు, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాట్లను తక్షణమే చేపట్టాలని, కృష్ణా తుంగభద్ర, పెన్నా నదులు, రాయలసీమలోని వాగుల, వంకల నీటి సంరక్షణకు సాగునీటి బడ్జెట్లో 42 శాతం నిధులు కేటాయించాలని, ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు తదితర నిర్మాణాలను చేపట్టాలని, నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ ను తక్షణమే తరలించి రాయలసీమ గౌరవ ప్రతీక అయిన నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం పరిరక్షణ చేపట్టాలని, శుస్క వాగ్ధానాలతో రాయలసీమను మభ్యపరిచే కార్యక్రమాలుకు అంతం పలకాలని సమావేశం డిమాండ్ చేసింది. రాయలసీమ‌ ఆత్మగౌరవానికి విఘాతం కలిగించే ప్రభుత్వ చర్యలను నిలువరించడంలో రాయలసీమ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు క్రియాశీలక పాత్ర వహించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.‌ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, మహమ్మద్ పర్వేజ్, మాజీ సర్పంచ్ రామగోపాల్ రెడ్డి, పట్నం రాముడు, జాతీయ BC వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సంఘం సెక్రటరీ సంజీవరాయుడు, మహేశ్వరరెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, సౌదాగర్ ఖాసీం మియా, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, కొమ్మా శ్రీహరి, నిట్టూరు సుధాకర్ రావు, క్రిష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!