
పోలీసులపై చర్యలు తీసుకొండి
పత్తికొండ న్యూస్ వెలుగు: గత నెల 24వ తేదీన పత్తికొండ కోర్టులో ఓ కేసులో లొంగిపోవడానికి వచ్చిన ముద్దాయిని కోర్టు లోకి చొరబడి మెడపట్టి లాక్కోని వెళ్లి, కోర్టు ధిక్కరణకు పాల్పడిన చిప్పగిరి, పత్తికొండ ఎస్ఐలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, నాగభూషణ రెడ్డి, ఐఏఎల్ జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య, న్యాయవాది నరసింహయ్య ఆచారి లు డిమాండ్ చేశారు. గురువారం పత్తికొండలో న్యాయవాదులు స్థానిక నాలుగు స్తంభాల మండపం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ.. కోర్టు ధిక్కరణకు పాల్పడిన పోలీసులపై ఎలాంటి చర్యలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. కోర్టు దిక్కరణకు పాల్పడిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యాచరణలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

