
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలి : సిపిఐ
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలి : సిపిఐ
న్యూస్ వెలుగు నంద్యాల: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేసినట్టు చేసిన ప్రకటన పై చంద్రబాబు నాయుడు స్పందించకపోతే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని రాయలసీమ హక్కులకు భంగం కలిగించాలని చూస్తే రాజకీయ సమాధి కి పునాదిరాయిగా రాయలసీమ ఎత్తిపోతల పథక ఉద్యమం ఊపిరి పోస్తుందని, రాయలసీమ జీవనాడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు పోరాటం చేపడతామని గురువారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ జిల్లాల శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా 2020 మే నెల 5వ తేదీన 6829.15 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వెడెల్పు సామర్థ్యం పెంపు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జి.ఓ నెం. 203 జారీ చేశారు అన్నారు.
శ్రీశైలం జలాశయం వెనకబాగంలో సంగమేశ్వర నుంచి రోజుకు 3 టియంసిలు చొప్పున ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు దిగువన నాలుగు కిలోమీటర్ల వద్ద శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో కలిపేందుకు,
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకూ కాలువ సామర్థ్యాన్ని 80,000
క్యుసెక్కులకు పెంపు, అక్కడినుండి
శ్రీశైలం కుడి కాలువ (ఎస్.ఆర్.బి.సి), గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ గండికోట వరకు 20,000 క్యుసెక్కుల నుండి 30,000 క్యుసెక్కులకు పెంచుతూ తెలుగుగంగ, ఎస్ ఆర్ బి సి, నిప్పుల వాగు సామర్ధ్యం పెంచేందుకు నిధులు కేటాయించి 80% పనులు పూర్తయ్యాయని ప్రభుత్వం మారిన మరుక్షణం పనులు నిలువుదల చేయడం విచారకరమన్నారు. పైగా పనులు నిలుపుదలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకే నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించలేదంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని వారు ఆరోపించారు.
నికర జలాలు కలిగిన ఎస్ ఆర్ బి సి, కేసీ కెనాల్, తెలుగంగ, మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన గాలేరు నగరి, జిఎన్ఎస్ఎస్ రెండో దశ నుంచి హెచ్ ఎన్ ఎస్ ఎస రెండో దశ ప్రాజెక్టులకు రావలసిన నీటి ముఖ ద్వారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీళ్లు అందాలంటే శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు అమలు చేయాల్సి ఉండగా శ్రీశైలం కుడి ఎడమల విద్యుత్తు ఉత్పత్తి, నీటిమట్ట ఆమలకు నోచుకోక రాయలసీమకు నీళ్లు అందడం లేదన్నారు. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి గుక్కాడు మంచినీటి కోసం అల్లాడిపోతున్న పరిస్థితుల్లో శ్రీశైలం నుండి త్రాగునీటి కోసం నీటిని తరలించే వెసులుబాటు లేదన్నారు. ఏడాదిలో 30 రోజులు వరద సమయంలో వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నీటిని తరలించే వెసులుబాటు లేదన్నారు. రాయలసీమ నెల్లూరు జిల్లాల లోటు తీర్చేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఆటో తెలంగాణకు, ఇటు ఏపీలో ఉన్న అవగాహన రాహిత్యంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేతలకు ఎలాంటి నష్టం లేదన్నారు.
హక్కులు అవకాశాలు కోల్పోయి నిత్యం కరువు వలసలు ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న రాయలసీమ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును, రాష్ట్ర రాజధానిని కోల్పోయిందన్నారు. చంద్రబాబు గత తొమ్మిది సంవత్సరాల పాలన లో ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం వల్ల బచావత్ ట్రిబ్యునల్ లో నికర జలాలు కోల్పోయి, మిగులు జలాలపై ఆధార పడాల్సి వచ్చిందని వాటిని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాలరాస్తూ ఇచ్చిన తీర్పు రాయలసీమ పాలిట మరణ శాసనంగా మారిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం నిధులన్నీ ఒక ప్రాంతానికి పరిమితం చేసి వెనకబడిన ప్రాంతాలను విస్మరించారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని డబల్ ఇంజన్ సర్కారులో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పెద్దపేట వేస్తామని ఒకవైపు చెబుతూ మరోవైపు రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా పక్కకు నడుతున్నారని వారు ఆరోపించారు. కనీసం నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి రాష్ట్ర నీటి హక్కులు కాపాడాల్సిన డబల్ ఇంజన్ సర్కారులో కూడా దగాకోర విధానాలతో రాయలసీమ రైతాంగం నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వంట కాలంలో నిర్మాణం ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు అందించాల్సిన చంద్రబాబు గోదావరి బనకచర్ల ఎత్తిపోతల పథకం పేరుతో కాంట్రాక్టర్ల కడుపు నింపే ప్రాజెక్టు చేపడతామని చెప్పడం శోచనీయమన్నారు. 80 శాతం పనులు పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వంతో రూపాయి కారు ఒప్పందలు చేసుకొని రాయలసీమ నోట్లో మట్టి కొట్టాలని చూడడం రాయలసీమ ద్రోహం చేయడమే అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో మాట్లాడి నిలుపుదల చేయించినట్లు చేసిన ప్రకటన పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించకపోతే ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని బార్ డిమాండ్ చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విషం చిమ్మిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మాట్లాడే రాయలసీమ నాయకులు ఎత్తిపోతల పథకం వల్ల జరిగే నష్టాలు ఏంటో చర్చించడానికి బహిరంగ చర్చకు రావాలని వారు సవాలు విసిరారు. రాయలసీమ ప్రయోజనాలను నష్టం కలిగించాలని చూస్తే రాజకీయ సమాధికి పునాదిరాయిగా రాయలసీమ ఎత్తిపోతల ఉద్యమం మారుతుందని వారు హెచ్చరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేసే వరకు అన్ని వర్గాలను ఏకం చేసి పోరాటానికి శ్రీకారం చుడతామని వారు స్పష్టం చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలను తెలుపుతున్న తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేని ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టి, అడ్డగోలు కేటాయింపులు కావాలని వితండవాదం చేస్తుంటే తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం బిజెపి తానా అంటే తందానా అనే సామెత లాగా నీటి కేటాయింపుల సమీక్ష పేరుతో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన బ్రజేస్ కుమార్ ట్రిబ్యునల్ కు కట్టబెట్టడం, ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బిజెపి వివాదాలను జటిలం చేస్తుందన్నారు.


