హెచ్‌ఆర్‌సి, లోకాయుక్త ఇక కర్నూలు లోనే..! మంత్రి
రాష్ట్ర మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రజల మనోభావాలను గౌరవించే చారిత్రాత్మక నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి), లోకాయుక్త కార్యాలయాలు కర్నూలులోనే ఉంచుతున్నట్లు సీఎం చెప్పారని మంత్రి టి.జి భరత్ తెలిపారు. హెచ్.ఆర్.సి, లోకాయుక్త కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించాలని రాయలసీమ ప్రజాప్రతినిధులందరం సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్న తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి టి.జి భరత్ చెప్పారు. ఈ గొప్ప నిర్ణయం రాయలసీమ ప్రజలకు న్యాయం మరియు పాలన అందుబాటులో ఉండేలా చేస్తుందన్నారు. తామందరం కలిసికట్టుగా ఉంటూ పటిష్టమైన, సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తూనే ఉంటామన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సహకరించిన మంత్రివర్గానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకదాని తర్వాత మరొకటి నెరవేర్చుతూ ముందుకు వెళుతుందన్నారు. ప్రజలందరూ తమపై నమ్మకం పెట్టుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో ఈ ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.