కారుణ్య నియామకాలకు అడుగులు వేసిన ప్రభుత్వం : డిప్యూటీ సీఎం
అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో జరుగుతున్న కారుణ్య నియామకాలను సమీక్షించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు లేదా ఉపాధ్యాయుల మరణానంతరం, వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో జాప్యం కారణంగా పలువురు అర్జీలు ఇచ్చిన నేపథ్యంలో వాటి పరిష్కారంపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంబంధిత విభాగాల్లో ఖాళీలు తక్కువగా ఉండటం వల్ల నియామకాల ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందని అధికారులు వివరించారు. నియామకాల కోసం ఎదురుచూస్తున్న అర్హులను, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాళీల్లో నియమించే ప్రయత్నాలు చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖతో చర్చించి, వేగంగా నియామకాలు జరిగేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్‌లకు సూచనలు అందించారు. నియామకాల ప్రక్రియను పారదర్శకత, సమర్థతతో పూర్తి చేయాలని, తద్వారా మరణించిన ఉద్యోగుల కుటుంబాల వారికి అండగా నిలబడవచ్చు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.